ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా పసికూన అప్ఘానిస్తాన్ కు ఇంగ్లాండ్ జట్టు విశ్వరూపం చూపించింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు ఆకాశమే హద్దుగా  చెలరేగింది. ముఖ్యంగా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్  పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ప్రతి బంతిని బౌండరీకి తరలించాలన్నదే లక్ష్యంగా చెలరేగాడు. ఇలా అప్ఘాన్ బౌలర్లను  ఊచకోత  కోస్తూ మోర్గాన్ కేవలం 71 బంతుల్లోనే 148 పరుగుతో చెలరేగి  ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

మోర్గాన్ 148 పరుగులను సాధించే క్రమంలో ఏకంగా  17 సిక్సర్లు బాదాడు. ఇతడి  వీరవిహారం ముందు టీమిండియా  ఓపెనర్ రోహిత్ శర్మ, విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ రికార్డులు ఒకేసారి బద్దలయ్యారు.  వీరు ముగ్గుర కూడా ఒకే మ్యాచ్ లో 16 సిక్సర్లు బాది రికార్డు సృష్టించారు. ఇలా సంయుక్తంగా వారి ముగ్గురి పేరిట వున్న అత్యధిక సిక్సుల రికార్డును తాజాగా17 సిక్సులు బాది మోర్గాన్ బద్దలుగొట్టాడు. ఇలా వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా మోర్గాన్‌ నూతన రికార్డు నెలకొల్పాడు.  

ఇదే క్రమంతో ఇయాన్ ఖాతాలోకి మరో అరుదైన ఘనత కూడా వచ్చి చేరింది. అతడు ఇప్పటివరకు ఆడిన అన్ని వన్డేల్లో కలిపి బాదిన సిక్సర్ల సంఖ్య 200కు చేరుకుంది. ఈ ఘనతను అందుకున్న అతి తక్కువ అంతర్జాతీయ క్రికెటర్లలో మోర్గాన్ పేరు కూడా చేరింది. 

ఇక మోర్గాన్ మెరుపు ఇన్నింగ్స్ కు ఓపెనర్ బెయిర్ స్టో 90, రూట్ 88 పరుగులు తోడవడంతో అప్ఘాన్ ముందు ఇంగ్లాండ్ భారీ స్కోరు నిలిపింది. చివర్లో మోయిన్ అలీ కూడా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 397 పరుగుల భారీ స్కోరు సాధించింది.