మాంచెస్టర్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో పాక్ పై భారత్ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఐసిసి ప్రపంచ కప్ టోర్నీని ప్రారంభించినప్పటి  నుండి ఇప్పటివరకు భారత్  పై పాక్ గెలిచిన దాఖలాలు లేవు. అయితే ఈసారి భారత్ ను ఓడించి చరిత్రను తిరగరాయాలనుకుంది. కానీ భారత్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా మరోసారి 89 పరుగుల తేడాతో పాక్ ను చిత్తుగా ఓడించింది. ఇలా కనీస పోరాటపటిమ చూపకుండా దాయాది చేతిలో ఓడిన పాక్ ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

అయితే పాక్ సాధించలేనిది తాను సాధించి చూపుతానంటూ పాక్ సంతతికి చెందిన బ్రిటిష్ బాక్సర్ అమిర్ ఖాన్ శపథం చేస్తున్నాడు. జూలై 12వ తేదీన సౌదీ అరేబియాలో జరగనున్న బాక్సింగ్ పోటీలో తాను భారత బాక్సర్ నీరజ్ గోయత్ తో పోటీ పడనున్నట్లు అమీర్ తెలిపాడు. ఇందులో భారత బాక్సర్ ను ఓడించడం ద్వారా ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో పాక్ కు ఎదురయిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటానంటూ ఓ  ట్వీట్ చేశాడు. 

 

దీనిపై భారత బాక్సర్ నీరజ్ కు అంతే ఘాటుగా జవాభిచ్చాడు. '' అలా కలలు కంటూనే వుండు. ఆ రోజు నువ్వే(అమీర్ ఖాన్) నా విజయానికి సాక్ష్యంగా మిగిలిపోతావు. అలాగే ఇండియా విజయానికి కూడా'' అంటూ ట్వీట్ చేశాడు. 

భారత్ పై శపథం  చేస్తూనే అమీర్ మరో ట్వీట్ ద్వారా పాక్ క్రికెట్లపై  విమర్శలు గుప్పించాడు. ముఖ్యంగా పాక్ ఆటగాళ్లు ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలని సూచించాడు. ఆ విషయంలో తన సహాయం కావాలంటే తప్పకుండా చేస్తానన్నాడు. పాక్ జట్టులో టాలెంట్ కలిగిన ఆటగాళ్ళు వున్నారు. కానీ ఫిట్ నెస్ విషయంలో వారి అలసత్వమే  జట్టు ఓటమికి కారణమవుతోందని  అమీర్ పేర్కొన్నాడు.