ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఇవాళ(శనివారం) జరుగుతున్న మ్యాచ్  ఆతిథ్యం ఇంగ్లాండ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోందట.  ఎందుకంటే వారు తలపడుతున్న ప్రత్యర్థి బంగ్లాదేశ్ మరి. ఏంటి పసికూన బంగ్లాదేశ్ ను చూసి బలమైన ఇంగ్లాండ్ జట్టు భయపడటమేంటి...అదీ స్వదేశంలో... అన్న అనుమానం మీకు కలిగిందా?  అయితే మీరు ప్రపంచ కప్ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సిందే.  

అంతర్జాతీయ జట్లన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టుకు బంగ్లాదేశ్ పై చెత్త  రికార్డుంది. ఇప్పటివరకు మొత్తం మూడుసార్లు ఈ  రెండు జట్లు ప్రపంచ కప్ లో తలపడగా బంగ్లాదేశ్ రెండు సార్లు గెలిచింది. కేవలం ఒక్కదాంట్లో మాత్రమే ఇంగ్లాండ్ గెలిచింది. ఇందులో కూడా ఇంగ్లాండ్ ఎప్పుడో 2007 సవంత్సరంలో బంగ్లాను ఓడించింది. కానీ బంగ్లాదేశ్ మాత్రం 2011, 2015 రెండు సంవత్సరాల్లోనూ వరుసగా ఇంగ్లీష్ జట్టును ఓడించుకుంటూ వస్తోంది. ఈసారి  కూడా అదే  ఊపు కొనసాగించి ఇంగ్లాండ్ పై హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని బంగ్లా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. 

ఇలా గత ప్రపంచ కప్ అనుభవాలు ఇప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఆందోళనలోకి నెడుతున్నాయి. అయితే ఇలా రెండు సార్లు ఓటమిపాలయ్యింది విదేశాల్లో. కానీ ఇప్పుడు జరుగుతున్న స్వదేశంలో. కాబట్టి సొంత మైదానం, అభిమానుల సపోర్టు తమకు కలిసి వస్తుందని ఇంగ్లాండ్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ఈ మ్యాచ్ ను గెలిచి తమ సత్తా చాటడంతో పాటు ప్రపంచ కప్ లో బంగ్లాపై వున్న చెత్త రికార్డును తొలగించుుకోవాలని చూస్తోంది.