ప్రపంచ కప్ టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్ తోనే కాదు కొందరు ఆటగాళ్లు కళ్లుచెదిరే ఫీల్డింగ్ తోనూ ఆకట్టుకుంటున్నారు. తమ జట్టు ప్రయోజనాల కోసం ఎంతటి రిస్కీ ఫీల్డింగ్ అయినా చేయడానికి సిద్దపడుతున్నారు. ముఖ్యంగా బౌండరీల వద్ద అద్భుతమైన క్యాచ్ లు అందుకుని అభిమానుల మనసులను గెలుచుకోవడమే కాదు జట్టును కూడా గెలిపిస్తున్నారు. ఇలా గత గురువారం జరిగిన మ్యాచ్ లో విండీస్ ఆటగాడు షెల్డన్ కోట్రెల్ బౌండరీ వద్ద అసాధారణ రీతిలో క్యాచ్ అందుకుని అందరు నోరెళ్లబెట్టుకునేలా చేశాడు. 

ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యచ్ లో విండీస్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే మొదట్లో ఆసిస్ బౌలర్లను బెంబేలెత్తించిన విండీస్ మిడిల్ ఓవర్లలతో చేతులెత్తేసింది. దీంతో స్మిత్ హాఫ్ సెంచరీని సాధించి  మరింత దాటిగా ఆడుతున్న  సమయంలో కోట్రెల్ అద్భుతం చేశాడు.  

మొదటి ఇన్నింగ్స్ 44వ ఓవర్‌ రెండో బంతిని థామస్‌ ఫుల్‌ లెంగ్త్‌లో వికెట్లకు దూరంగా వేయగా స్మిత్‌ తనదైన శైలిలో లాంగ్‌ లెగ్‌లోకి భారీ షాట్‌ ఆడాడు. అందరు అది సిక్స్ వెళుతుందని అనుకుండగా కోట్రెల్ 20 గజాల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఎడమ చేత్తో ఆ బంతిని అంతుకున్నాడు. అయితే ఆ వేగంలో శరీరాన్ని అదుపుచేసుకోలేక బౌండరీలైన్ దాటుతూ బంతిని గాల్లోకి ఎగరేశాడు. అలా మళ్లీ బౌండరీ లైన దాటుకుని వచ్చి బంతిని అందుకున్నాడు. ఇలా కళ్లుచెదిరే ఫీల్డింగ్ కోట్రెల్ కీలక ఆటగాడు స్మిత్  (73 పరుగులు) ను పెవిలియన్ కు పంపాడు. 

ఇప్పటికే కోట్రెల్ వికెట్ తీసిన వెంటనే వినూత్నంగా సంబరాలు చేసుకుంటూ అభిమానుల దృష్టిలో పడ్డాడు. తన బౌలింగ్ లో వికెట్ పడగానే మార్చ్ పాస్ట్ చేస్తూ సెల్యూట్ చేస్తుంటాడు. ఇది అభిమానులను ఆకట్టుకోగా తాజా  క్యాచ్ అతడిలోని అత్యుత్తమ పీల్డర్ ను కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. కోట్రెల్ ఈ క్యాచ్ అందుకుంటున్న వీడియోను ఐసిసి ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. క్రికెట్ ప్రియులకు ఇదికాస్తా  నచ్చడంతో తెగ వైరల్ గా మారింది. దీంతో ఈ విండీస్ ప్లేయర్ కోట్రెల్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.