ప్రపంచ కప్ లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో వెస్టిండిస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే పార్మాట్ లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా గేల్  నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ గేల్ 36 పరుగులు చేసి ఔటయ్యాడు.   దీంతో వన్డేల్లో ఇంగ్లాండ్ పై అతడి పరుగులు 1632 చేరుకున్నాయి. ఇలా గతంలో సంగక్కర పేరిట వున్న అత్యధిక పరుగుల రికార్డును తాజా ఇన్నింగ్స్ తో గేల్ బద్దలుగొట్టాడు. 

శ్రీలంక ఆటగాడు సంగక్కర  ఇంగ్లాండ్ పై 41 వన్డేలాడి  1625 పరుగులు చేశాడు. కానీ క్రిస్ గేల్ మాత్రం కేవలం  34 వన్డేల్లోనే అతడిని అధిగమించి సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇక వీరిద్దరి తర్వాత ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు సాధించినవారి జాబితాలో రిచర్డ్స్ సన్ (1619), పాంటింగ్ (1598), జయవర్ధనే (1562) పరుగులతో తర్వాతి మూడు స్థానాల్లో నిలిచారు. 

ప్రపంచ కప్ సీజన్ 12లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో తలపడుతున్న  విండీస్ జట్టు తడబడుతోంది. ఇప్పటికే దాటిగా ఆడే క్రమంలో క్రిస్ గేల్ 36 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అలాగే మరో ఓపెనర్ లూవిస్ కేవలం 2 పరగులు, హోప్స్ 11 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. దీంతో 55 పరుగలకే కీలమైన మూడు వికెట్లు కోల్పోయిన విండీస్ కష్టాల్లో పడింది.