''బలిదాన్ బ్యాడ్జ్''...ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరిది. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ దేశ రక్షణ కోసం వీరమరణం పొందిన అమరవీరుల జ్ఞాపకార్థం రూపొందించిన లోగో. ఇంతటి ప్రాధాన్యత కలిగిన దీని గురించి మొన్నటి వరకు భారతీయుల్లో చాలామందికి తెలీదు. కానీ టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని తన దేశభక్తిని క్రికెట్లోకి చొప్పించి ఈ  బలిదాన్ సింబల్ ను యావత్ దేశానికి పరిచయం చేశాడు.  కాదు కాదు ప్రపంచానికే పరిచయం చేశాడు. అయితే అలా ధోని దేశప్రేమను చాటుకోవడాన్ని కూడా ఐసిసి వివాదాస్పదం చేసింది. దీంతో యావత్ భారతం మహేంద్రుడికి మద్దుతుగా నిలవగా తాజాగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా అండగా నిలిచారు. 

ఇన్స్టాగ్రామ్ లో ధోని తన గ్లవ్స్ పై వాడిని బలిదాన్ చిహ్నాన్ని మంత్రి  పోస్ట్ చేశాడు. #menofhonour @indianarmy లను జతచేసి ఈ చిహ్నాన్ని పోస్ట్ చేశారు. అయితే ఆమె ప్రత్యక్షంగా ధోనికి మద్దతివ్వకున్నా దీనిపై  వివాదం నడుస్తున్న సమయంలో ఈ పోస్ట్ చేసింది. అంటే పరోక్షంగా ధోనికి మద్దతిస్తూనే ఆమె ఈ పోస్ట్ చేశారని అభిమానులు భావిస్తున్నారు.     అంతేకాకుండా ధోనికి మద్దతుగా నిలిచినందుకు ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఇటీవలే దక్షిణాఫ్రికాపై మొదటి మ్యాచ్ ఆడి  గెలిచింది. అయితే ఈ  మ్యాచ్ లో ధోని వికెట్  కీపింగ్ చేస్తున్న సమయంలో వాడిన గ్లోవ్స్ వివాదానికి కారణమయ్యాయి. దేశానికి రక్షణగా నిలిచే ఆర్మీ అంటే స్వతహాగా ముందునుండి ఇష్టపడే ధోని  బలిదాన్ చిహ్నాన్ని కలిగిన గ్లోవ్స్ వాడాడు. అయితే ఇలాంటి సింబల్స్ ను ఉపయోగించడం తమ నిబంధనలకు విరుద్దమని ఐసిసి పేర్కొంది, కాబట్టి ఆ గ్లోవ్స్ తదుపరి మ్యాచ్ లో ధోని వాడకుండా ఆపాలంటూ బిసిసిఐకి సూచించింది. 

ఐసిసి చర్యలు భారత అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా చేశాయి. ఎట్టి పరిస్థితుల్లో ధోని అవే గ్లవ్స్ వాడాలంటూ వారు కోరుకుంటున్నారు. ఇలా అతడికి మద్దతుగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా  తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. తాజాగా  స్మృతి ఇరానీ కూడా ధోనికి మద్దతిస్తున్నవారి జాబితాలో చేరిపోయారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#heroes #menofhonour @indianarmy.adgpi 🙏

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Jun 7, 2019 at 8:01pm PDT