ప్రపంచ కప్ లో మరో రసవత్తర సమరానికి రంగం సిద్దమయ్యింది. భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్ రేపు జరగనుంది. ఈ టోర్నీ మొదలైన వారం రోజులకు భారత్ మొదటి మ్యాచ్ ఆడుతోంది. బుధవారం దక్షిణాఫ్రికాతో జరగనున్న ఈ మ్యాచ్ కోసం గత వారం రోజులుగా టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆటగాళ్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్న వీడియోను బిసిసిఐ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ముఖ్యంగా ధోని ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ దానిపై బిసిసిఐ ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసింది. 

ధోని నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకుంది. అందులో ధోని బంతిని బలంగా బాదుతూ భారీ షాట్లను ప్రాక్టీస్ చేయడం కనిపిస్తోంది.  ఈ వీడియోకు బిసిసిఐ ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టింది. '' ధోని  అతిసులభంగా, ఒడుపుగా బంతిని బలంగా బాదుతూ మైదానం బయటకు పంపిస్తున్నాడు''  అంటూ బిసిసిఐ ట్వీట్ చేసింది. 

కేవలం ధోని మాత్రమే టీమిండియా ఆటగాళ్లు మొత్తం  మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. బలమైన బ్యాటింగ్, బౌలింగ్ విభాగాన్ని కలిగిన సౌతాఫ్రికా ను ఓడించడం అంత  ఈజీ కాదు. అందుకోసం భారత జట్టు  మొత్తం సమిష్టిగా రాణించాల్సి వుంటుంది. అందుకోసమే టీమిండియా ఆటగాళ్ళు నెట్స్ లో తీవ్రంగా శ్రమించడమే కాకుడా సౌతాఫ్రికాను దెబ్బతీయడానికి ప్రత్యేక వ్యూహాలను రచిస్తోంది. మొదట మ్యాచ్ లో గెలిచి  అదే ఆత్మవిశ్వాసాన్ని మిగతా టోర్నీమొత్తం కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. అందుకోసమే బుధవారం జరిగే మ్యాచ్ ను ఎట్టిపరిస్థితుల్లో గెలవాలన్న పట్టుదలతో భారత ఆటగాళ్లున్నారు. 
 
ఈ మ్యాచ్ కు ముందే టీమిండియాకు కలిసొచ్చే నిర్ణయం దక్షిణాఫ్రికా మేనేజ్ మెంట్ నుండి వెలువడింది. ఆ జట్టు ప్రధాన పేసర్‌ లుంగి ఎంగిడి గాయం కారణంగా టీమిండియాతో మ్యాచ్‌కు దూరం కానున్నాడు.  అత్యంత ప్రమాదకరమైన అతడు సౌతాఫ్రికాకు దూరం కావడం టీమిండియాకు కలిసిరానుంది. అంతేకాకుండా దక్షిణాఫ్రికా ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఢీలా పడివుంది. కాబట్టి తీవ్ర ఒత్తిడిలో వున్న ఆ జట్టు ఆటగాళ్లను  ఎదుర్కోవడం టీమిండియాకు పెద్ద కష్టం కాకపోవచ్చు.