ఐసిసి 2019 ప్రపంచ కప్ ముగిసింది. ఇంగ్లాండ్ వేదికన జరిగిన ఈ టోర్నీలో టీమిండియా అద్భుతంగా ఆడినా విశ్వవిజేతగా నిలవలేకపోయింది. దురదృష్టం వెంటాడటంతో కోహ్లీ సేన సెమీఫైనల్ నుండే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టు జోరును సెమీస్ లో న్యూజిలాండ్ అడ్డుకుంది. అయితే ఇలా అర్థాంతరంగా భారత జట్టు ప్రపంచ కప్ నుండి నిష్క్రమించడంలో ఆటగాళ్ల మధ్య కొనసాగుతున్న విబేధాలే కారణమంటూ ఓ ప్రచారం జరుగుతోంది. దీనిపై బిసిసిఐ కూడా దృష్టిసారించినట్లు  సమాచారం.

టీమిండియాలో ప్రస్తుతమున్న సీనియర్ ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లుగా ఓ వార్త బాగా ప్రచారమవుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ,  వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య అగాదం ఈ మెగా టోర్నీ ద్వారా మరింత పెరిగినట్లు సమాచారం. దీంతో ఆటగాళ్లు రెండు వర్గాలుగా చీలిపోయినట్లు... ఓ వర్గానికి కోహ్లీ, మరో వర్గానికి రోహిత్ లు  సారథ్యం వహిస్తున్నట్లు సమాచారం. క్రీడా వర్గాల్లో ఇప్పుడు ఇదే వార్తపై తీవ్ర చర్చ జరుగుతోంది. 

దీంతో బిసిసిఐ కూడా ఆటగాళ్ల మధ్య విబేధాలున్నట్లు సాగుతున్న ప్రచారంపై విచారణ జరపడానికి సిద్దపడినట్లు  తెలుస్తోంది. కోహ్లీ, రోహిత్ ల మధ్య నిజంగానే ఆదిపత్య పోరు సాగుతుందో లేదో ఈ విచారణ ద్వారా తేలనుందని ఓ బిసిసిఐ అధికారి తెలిపారు. ఒకవేళ ఈ ప్రచారం నిజమేనని తేలితే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తామని సదరు అధికారి తెలిపారు.

అయితే ఇప్పటికే  2019 ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగా ఆడినా విజయం సాధించలేకపోయింది. దీంతో 2023 వరల్డ్ కప్ లక్ష్యంగా భారత జట్టును తీర్చిదిద్దాలని బిసిసిఐ భావిస్తోందట. అందుకోసం జట్టులో భారీ మార్పులు చేపట్టనున్నట్లు...ముఖ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుండి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మ ను నియమించాలని చూస్తోందని తెలిపారు. కేవలం వన్డే జట్టుకు మాత్రమే రోహిత్ ను సారథిగా ఎంపికచేసి టెస్టులకు మాత్రం కోహ్లీనే కొనసాగించాలని చూస్తున్నట్లు  బిసిసిఐ అధికారి తెలిపారు.