ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో బంగ్లాదేశ్ సంచలనాన్ని సృష్టించింది. ఈ  మెగా టోర్నీ ఆరంభంలోనే దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్టును మట్టికరిపించిన బంగ్లా తాజాగా వెస్టిండిస్ పై కూడా భారీ తేడాతో గెలిచింది. ఈ విజయంతో తమది గాలివాటం గెలుపు కాదని బంగ్లా నిరూపించుకుంది. అయితే ఈ రెండు మ్యాచుల్లో జట్టు విజయం కోసం అద్భుత ప్రదర్శన చేసిన బంగ్లా ఆల్ రౌండర్ షకిబల్ హసన్ ఓ అరుదైన రికార్డును  సాధించాడు. 

సోమవారం  వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో షకిబ్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడి శతకాన్ని నమోదుచేసుకున్నాడు. కేవలం 99 బంతుల్లోనే అతడు 124 పరుగులతో నాటౌట్ గా నిలిచి బంగ్లాను విజయతీరాలకు చేర్చాడు. అయితే ఈ సెంచరీతో షకిబ్ అంతర్జాతీయ క్రికెట్లో ఆరు వేల పరుగులను పూర్తిచేసుకున్నాడు. అంతేకాకుండా ఇదే మ్యాచ్ లో ఇద్దరు విండిస్ బ్యాట్ మెన్స్ ను కూడా అతడు ఔట్ చేశాడు. దీంతో అతడు తీసిన వికెట్ల సంఖ్య 250 కి చేరింది. 

ఇలా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆరువేల పరుగులు, 250కి పైగా వికెట్లు పడగొట్టిన నాలుగో అంతర్జాతీయ క్రికెటర్ గా షకిబ్ రికార్డు నెలకొల్పాడు.  అంతకు ముందు సనత్ జయసూర్య (శ్రీలంక), జాక్వస్ కలిస్(సౌతాఫ్రికా), షాహిద్ అఫ్రిది(పాక్) మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరి తర్వాత నిలకడైన అత్యుత్తమ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఈ ఫీట్ సాధించిన నాలుగో క్రికెటర్ షకిబుల్ హసన్ నిలిచాడు. 

ఇక  మొదటి నుండి బంగ్లాదేశ్ ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ అద్భుతంగా రాణిస్తున్న షకిబ్  ఈ టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వెస్టిండిస్ పై చేసిన 124 పరుగులను కలుపుకుంటే షకిబ్ ఖాతాలో384 పరుగులు చేరాయి. దీంతో ఇప్పటివరకు టాప్ స్కోరర్ గా నిలిచన ఆసిస్ కెప్టెన్ ఫించ్ (343)  ను వెనక్కినెట్టి షకిబ్ అగ్రస్థానాన్ని ఆక్రమించాడు.