ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జరుగుతున్న రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ బౌలర్ల జోరు కొనసాగుతోంది. అయితే కేవలం 14 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడిన ఆస్ట్రేలియాను స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ ఆదుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ బౌన్సర్ క్యారీని తీవ్రంగా  గాయపర్చింది. నొప్పితో విలవిల్లాడిపోతున్నప్పటికి  క్యారీ జట్టు ప్రయోజనాల కోసం బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 

ఆర్చర్ వేసిన ఎనిమిదో ఓవర్లో ఓ  బౌన్సర్ నేరుగా వెళ్లి బ్యాట్ మెన్ క్యారీ దవడకు బలంగా తాకింది. హెల్మెట్ వున్నప్పటికి బంతి మితిమీరిన వేగంతో వుండటంతో క్యారీ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి దవడ పగిలి రక్తం కారతుండటంతో నొప్పితో విలవిల్లాడిపోయిన అతడు మైదానంలోనే కుప్పకూలాడు. దీంతో వెంటనే ఆసిస్ టీం ఫిజియో అతడివద్దకు చేరుకుని గాయానికి ప్రథమచికిత్స చేశాడు. 

అయితే గాయం తీవ్రత అధికంగా వుండటంతో క్యారీ రిటైర్డ్ హట్ గా వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో వున్న జట్టును ఆదుకునేందుకు నొప్పితోనే ఆడటానికి క్యారీ సిద్దమయ్యాడు. గాయానికి చిన్న  ప్లాస్టర్ వేసుకుని  బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 

ప్రస్తుతం ఆసిస్ 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 92 పరుగుల వద్ద నిలిచింది. స్మిత్ (37 పరుగులు),  క్యారీ(36 పరుగులు) హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని  నెలకొల్పి జట్టును మంచి  స్కోరు దిశగా నడిపిస్తున్నారు. అంతకుముందు కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌటవగా మరో ఓపెనర్ వార్నర్ 9 పరగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత హ్యాండ్స్‌ కోబ్(4 పరుగులు)  కూడా మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఇలా 14 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి  కష్టాల్లోపడ్డ జట్టును క్యారీ,స్మిత్ జోడీ ఆదుకుంటోంది.