ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా టౌన్టన్ వేదికన జరుగుతున్న పోరులో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతోంది. భారత్ చేతిలో ఓటమి తర్వాత మంచి కసిమీదున్న ఆసిస్ ఆటగాళ్లు పాక్ బౌలర్లలను ఉతికారేస్తున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్ లు అదిరేటి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు వికెట్ నష్టపోకుండా 146 భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  అయితే ఫించ్ 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటవడంతో ఈ ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. 

అయితే ఇలా పాకిస్థాన్ పై సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ఆసిస ఓపెనింగ్ జోడి ఓ అద్భుత రికార్డును నమోదుచేసింది.  1996 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటివరకు పాక్ పై సెంచరీ భాగస్వామ్యాన్ని ఏ  ఓపెనింగ్ జోడీ సాధించలేకపోయింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు స్మిత్ , మికీ లు తొలి వికెట్ కు 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

తాజాగా ఫించ్, వార్నర్ జోడి 23 ఏళ్ల తర్వాత పాక్ పై సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించి రికార్డు నెలకొల్పారు. ఇలా ఐదు ప్రపంచ కప్ ల తర్వాత మరోసారి పాక్ పై ఆసిస్ ఓపెనర్లు 146 పరుగులు చేశారు. అయితే పాక్ పై ఇప్పటివరకు ఏ ప్రపంచ కప్ లోనూ ఆసిస్ ఓపెనర్లు వందకు పైగా పరుగులు సాధించిన చరిత్ర  లేదు. అలా చూసినా వార్నర్, పించ్ లు అరుదైన ఘనతను అందుకున్నారనే చెప్పాలి.