ప్రపంచ కప్ టోర్నీలో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ పై ఐసిసికి ఫిర్యాదు అందింది. అతడు మైదానంలో కామెంటరీ చేసే సమయంలో ఐసిసి నిబంధనలను ఉళ్లంఘిస్తున్నాడంటూ ఓ ఆసిస్ అభిమాని ఐసిసి దృష్టికి తీసుకెళ్ళాడు. మంజ్రేకర్ కామెంటరీ కేవలం ఒకే జట్టుకు మద్దతిచ్చేలా వుంటోందని...దీని వల్ల మిగతా జట్టు నష్టపోయే అవకాశాలున్నాయంటూ సదరు అభిమాని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

 ఇండియా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మంజ్రేకర్ కామెంటరీ అభ్యంతకరంగా వుందంటూ ఆసిస్ అభిమాని ఆడీ ఆరోపించాడు. సాధారణంగా మైదానంలో కామెంటేటర్లుగా వ్యవహరించేవారు ఇరు దేశాలకు మద్దతిచ్చేలా కామెంటరీ చేయాలి. కానీ మంజ్రేకర్ టీమిండియాకు మద్దతిచ్చేలా ధోనిని ప్రశంసించాడని ఆడీ పేర్కొన్నాడు. ''వికెట్ల వెనకాల నిలబడ్డ ధోని మా వాచ్ డాగ్'' అంటూ మంజ్రేకర్ వాడిన పదాన్ని ఆడి ప్రధానంగా తప్పుబట్టాడు. 

ఇలా మా, మన  అన్న పదాలను  ఉపయోగించడం ద్వారా మంజ్రేకర్ పక్షపాతంగా  వ్యవహరించినట్లు అర్థమవుతోందన్నాడు. ఈ వ్యాఖ్యలు తననే కాదు ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ ప్రియులందరిని బాధించాయని పేర్కొన్నాడు. ఐసిసి నిబంధనలను ఉళ్లంఘించేలా వ్యవహరించిన అతడిపై చర్యలు తీసుకోవాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు. ఇలా ఐసిసికి రాసిన లేఖను ఆడి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్  గా మారింది.