బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్  కొద్దిరోజులు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమైన విషయం తెలిసిందే. దాదాపు ఏడాది పాటు తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియా జట్టు, క్రికెట్ కు దూరమైన అతడు ప్రపంచ కప్ ద్వారా మళ్లీ తిరిగి జట్టులోకి చేరాడు. ఇలా ఇంగ్లాండ్ లో జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో తానేంటో మరోసారి నిరూపించుకోవాలని వార్నర్ కసితో  ఆడుతున్నాడు. ఆ కసితోనే ఇటీవల పాకిస్ధాన్ పై జరిగిన మ్యాచ్ లో అద్భుత సెంచరీని సాధించిన వార్నర్ ఆసిస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

అయితే ఈ మ్యాచ్ తర్వాత వార్నర్ లో సెంచరీ సాధించిన ఆనందం  కనిపించలేదు. అందుకు కారణం నిషేద కాలంలో తాను అనుభవించిన మానసిక క్షోబే కారణమై వుంటుదని వార్నర్ మాటలను బట్టి తెలుస్తోంది. అయితే ఈ గడ్డుకాలం నుండి బయటపడి తానిలా అత్యుత్తమ ఆటగాడిగా రాణించడంలో తన భార్య క్యాండిస్ ప్రోత్సాహమే అధికంగా వుందన్నాడు. ఈ సెంచరీ క్రెడిట్ కూడా ఆమెకే దక్కుతుందని వార్నర్ పేర్కొన్నాడు. 

క్యాండిస్ ఎంతో గుండెనిబ్బరం కలిగిన మహిళ. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదురొడ్డి నిలబడగల ధైర్యం ఆమె సొంతం. ఆమె ప్రోద్భలంతోనే నాలో పోరాట పటిమ మరింత పెరింగిందన్నాడు. ఆమె అందించిన ఈ ధైర్యమే మళ్లీ క్రికెట్లో పునరాగమనం చేయడానికి తోడ్పడిందన్నాడు. క్యాండిస్ అందించిన ప్రోత్సాహమే ప్రపంచ కప్ టోర్నీలో పాక్ పై సెంచరీ(111 పరుగులు 107 బంతుల్లో) సాధించేలా చేసిందని తెలిపాడు. కాబట్టి ఆ సెంచరీతో తాను ఆసిస్ ను గెలిపిస్తే...తన ప్రోద్భలంతో ఆమె నన్ను గెలిపించిందని వార్నర్ పూర్కొన్నాడు.