ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో విజేతలను తేల్చడంతో ఐసిసి విఫలమైందని ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ మెగా టోర్నీ ఫైనల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ లు సమఉజ్జీలుగా నిలిచినా ఆతిథ్య జట్టును విజేతలుగా నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. అసలు సూపర్ ఓవర్ పేరుతో కేవలం ఆరు బంతుల్లోనే జట్ల బలాబలాలను ఎలా తేలుస్తారని కొందరు తప్పుబడుతుంటే బౌండరీల ద్వారా విజేతను నిర్ణయించడం అనేది మరింత వివాదాస్పద అంశంగా మారింది. అదీ ప్రపంచ కప్ మెగా టోర్నీ ఫైనల్లో కావడం మరింత చర్చకు దారితీస్తోంది.  తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ షేన్ వార్న్ కూడా దీన్ని తప్పుబట్టారు.

''ఆదివారం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా సాగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఈ మ్యాచ్ పలు మలుపులు తిరుగుతూ ఉత్కంఠభరితంగా సాగింది. రన్నరప్ తో సరిపెట్టుకున్నప్పటికి న్యూజిలాండ్ అత్యద్భుతంగా ఆడింది.  అలాగే ఇంగ్లాండ్ కూడా చాలా బాగా ఆడింది. 

అయితే ఫలితం పూర్తిగా తేలకముందే విజేతలను నిర్ణయించడం  కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక్క సూపర్ ఓవర్ టై అయితే మరో సౌపర్ ఓవర్ నిర్వహించాల్సింది. ఇలా ఫలితం తేలేవరకు ఎన్ని సూపర్ ఓవర్లయినా ఆడించాల్సింది. కానీ అలా చేయకుండా బౌండరీల ఆధారంగా ప్రపంచ కప్ విజేతను నిర్ణయించడం  బాధాకరం'' అని వార్న్ పేర్కొన్నాడు. 

ఇప్పటికే అత్యధిక  బౌండరీల విధానం ద్వారా న్యూజిలాండ్ కు ఐసిసి అన్యాయం చేసిందని చాలా మంది క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. వారికి మద్దతిస్తూ తాజాగా వార్న్ కూడా ట్వీట్ చేయడం మరింత చర్చకు దారితీస్తోంది. మరో సూపర్ ఓవర్ నిర్వహిస్తే నష్టమేమీ వుండేది కాదని....అలా కాకుండా ఐసిసి తప్పుడు నిర్ణయానికి కివీస్ బలికావాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇలా ఆయన చేసిన ట్వీట్ కు మద్దతుగా చాలామంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.