టీమిండియాతో మ్యాచ్ కు ముందే వెస్టిండిస్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగలింది. ఆ జట్టులో కీలక ఆటగాడు, ఆలౌ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ టోర్నీ ఆరంభం నుండే మోకాలి గాయం సమస్యతో అతడు సతమతమవుతున్నాడు. ఇలా గాయంతో ఆడుతూ ఆశించిన మేర రాణించకపోవడంతో అతన్ని ఈ టోర్నీ నుండి పక్కనపెడుతూ విండీస్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు ప్రపంచ కప్ టోర్నీలో రస్సెల్ నాలుగు మ్యాచులాడి 36 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే బౌలింగ్ లో కూడా రాణించలేకపోయాడు. దీంతో కేవలం  ఐదు వికట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అతడిని జట్టు నుండే కాదు ప్రపంచ కప్ టోర్నీ నుండే విండీస్ మేనేజ్ మెంట్ పక్కనబెట్టింది. రస్సెల్ స్థానంలో సునీల్ ఆంబ్రిస్ కు జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.  

ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకు ఆరు మ్యాచులాడిన విండీస్ కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. నాలుగింట్లో ఓటమిపాలవగా మరో మ్యాచ్ రద్దయింది. దీంతో ఆ జట్టు  సెమీస్ ఆశలు దాదాపు కోల్పోయిందనే చెప్పాలి. టీమిండియా తదుపరి మ్యాచ్ వెస్టిండిస్ తో ఆడనుంది. ఈ నేపథ్యంలో రస్సెల్ ప్రపంచ కప్ దూరమవడం భారత్ కు కలిసొచ్చే అంశమే.