ఇంతకాలం భారత జట్టులో కొనసాగిన ఓకేఒక తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు. తనదైన క్లాస్ బ్యాటింగ్ తో టీమిండియా తరపున అద్భుతంగా రాణించినా అతడికి తగిన ప్రాధాన్యత లభించలేదు. మరీ ముఖ్యంగా ఈ ప్రపంచ కప్ పై ఆశలు పెంచుకున్న అతడు ఎంతో కఠోరంగా  శ్రమించాడు. అయినా సెలెక్టర్లు తనను పక్కనబెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురయిన రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు అనూహ్యంగా  ప్రకటించి అందరనీ ఆశ్చర్యానికి గురిచేశాడు.  

అయితే రాయుడు రిటైర్మెంట్ ప్రకటన మాజీ టీమిండియా ఆటగాడు, ఎంపీ గౌతమ్ గంభీర్ కు ఎలాంటి ఆశ్యర్యాన్ని కలిగించలేదట. ఆత్మాభిమానం గల ఆటగాడు ఎవరైనా ఇన్ని అవమానాలు జరిగిన తర్వాత ఇలాగే చేస్తాడన్నాడని గంభీర్ పేర్కొన్నాడు. ముఖ్యంగా టీమిండియా సెలెక్షన్ కమిటీ అతడిపట్ల చాలా అవమానకరంగా ప్రవర్తించిందని ఆరోపించాడు. 

''ప్రస్తుతమున్న సెలెక్షన్ కమిటీలోని ఐదుగురు సభ్యుల కంటే అంబటి రాయుడు చాలా మంచి ఆటగాడు. ఆ ఐదుగురు కలిసి తమ కెరీర్ మొత్తంలో సాధించలేనన్ని పరుగులు రాయుడు ఒక్కడే సాధించాడు. అందుకోసమే అతన్ని ప్రపంచ కప్ కు ఎంపిక చేయలేనట్లున్నారు. శిఖర్ ధవన్ ప్రపంచ కప్ కు దూరమైతే స్టాండ్ బై ఆటగాడిగా వున్న రిషబ్ పంత్ కు అవకాశమిచ్చారు. కానీ విజయ్ శంకర్ దూరమైతే మిగిలిన స్టాండ్ బై ఆటగాన్ని రాయుడికి కాదని మయాంక్ కు అవకాశమిచ్చారు. ఇంత అవమానాన్ని ఎదుర్నొన్న రాయుడు స్థానంలో ఎవరున్నా ఇలాంటి నిర్ణయమే తీసకుంటారు.'' అని గంభీర్ ఎమ్మెస్కే  ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీపై తీవ్ర వ్యాక్యలు చేశాడు. 

భారత్ తరపునే కాదు ఐపిఎల్ లో కూడా రాయుడు అద్భుతంగా ఆడాడని గంభీర్ ప్రశంసించాడు. అంతర్జాతీయ స్థాయిలో అతడు మూడు సెంచరీలు, పది హాఫ్ సెంచరీలో అదరగొట్టాడని గుర్తుచేశాడు. ఇలాంటి ఆటగాన్ని కోల్పోవడం టీమిండియాకు నిజంగా లోటేనని  అన్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదో బాధాకరమైన  సంఘటన అని గంభీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.