ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో సమరానికి సిద్దమయ్యింది. సౌతాంప్టన్ వేదికగా అప్ఘానిస్తాన్ తో జరగనున్న మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు సిద్దమయ్యారు. ఈ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అతడు అప్ఘాన్ తో మ్యాచ్ ఆడతాడా...లేదా అన్న అనుమానాలు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. అయితే తన గాయంపై ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అప్ఘాన్ తో జరిగే మ్యాచ్ లో తాను బరిలోకి దిగనున్నట్లు విజయ్ క్లారిటీ ఇచ్చాడు.

బుమ్రా బౌలింగ్  లో  తనకు తగిలిన  గాయం గురించి విజయ్ మాట్లాడుతూ...అది చాలా చిన్న గాయమని అన్నాడు. యార్కర్ బంతి నేరుగా కాలికి తాకడంతో అప్పటికప్పుడు నొప్పి కలిగినా తర్వాత తగ్గిందన్నాడు. గాయమైన తర్వాతిరోజు  నుండే మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు శంకర్ తెలిపాడు. 

ఇక అప్ఘానిస్తాన్  తో మ్యాచ్ గురించి మాట్లాడతూ...రషీద్ ఖాన్ బౌలింగ్ తమకు సవాల్ గా మారనుందన్నాడు. అతడు ప్రస్తుతమున్న ప్రపంచ స్థాయి స్పిన్నర్లలో ఒకడని కొనియాడాడు. అతడితో కలిసి ఐపిఎల్ లో హైదరాబాద్ టీంలో ఆడానని  గుర్తుచేసిన విజయ్...ప్రాక్టీస్ సమయంలో అతడి నుండి చాలా వైవిధ్యమైన బంతులు వెలువడేవని తెలిపాడు. కాబట్టి ఈ అనుభవంతో రషీద్ ను ఎదుర్కోడానికి సిద్దంగా వున్నట్లు విజయ్ శంకర్ వెల్లడించాడు.  

ఇప్పటికే గాయాల కారణంగా ఓపెనర్ శిఖర్ ధవన్ ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా తొడకండరాలు పట్టేయడంతో దాదాపు రెండు మ్యాచులకు దూరమయ్యాడు. ఇలాంటి  సమయంలో విజయ్ శంకర్ గాయం టీమిండియా  ఆటగాళ్లు, మేనేజ్ మెంట్, అభిమానుల్లో ఆందోళనను కలిగించింది. అయితే తాను బాగానే వున్నానని... అప్ఘాన్ తో మ్యాచ్ లో అందుబాటులో వుంటానని స్వయంగా విజయ్ శంకరే ప్రకటించడంతో వారంతా ఊపిరి  పీల్చుకున్నారు.