ప్రపంచ కప్ సీజన్ 12లో వరుస ఓటములతో సతమతమవుతున్న పసికూన అప్ఘానిస్తాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. విధ్వంసకర ఓపెనర్, వికెట్ కీపర్  మహ్మద్ షాజాద్  అప్ఘాన్ జట్టుకు దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న అతడు ఈ  ప్రపంచ కప్ టోర్నీ మొత్తానికి దూరమైతున్నట్లు అప్ఘాన్ టీం మేనేజ్ మెంట్ తాజాగా ప్రకటించింది. అతడి స్థానాన్ని మరో యువ ఆటగాడు ఇక్రమ్ అలీని ఎంపికచేశారు.  

షాజాద్ ఈ టోర్నీ ఆరంభానికి ముందే గాయపడ్డాడు. పాకిస్తాన్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో అతడికి గాయమయ్యింది. అయితే జట్టు అవసరాల దృష్ట్యా అతన్ని పక్కనపెట్టకుండా ఆస్ట్రేలియా, శ్రీలంకలతో జరిగిన  మ్యాచుల్లో ఆడించారు. ఈ రెండు మ్యాచుల్లోనూ అతడు ఆశించినమేర రాణించలేకపోయాడు. ఆస్ట్రేలియా  తో మ్యాచ్ డకౌటయిన షాజాద్ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కేవలం 7 పరగులు మాత్రమే చేసి  పెవిలియన్ కు  చేరాడు. 

అయితే తాజాగా అతడి గాయం తీవ్రత పెరగడంతో విశ్రాంతి ఇవ్వక తప్పడంలేదని అధికారులు తెలిపారు. షాజాద్ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడని తెలిపారు. ఇలా కీలక ఆటగాడు జట్టుకు దూరమవడం అప్ఘాన్ జట్టుపై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లషకులు అభిప్రాయపడుతున్నారు.  
 
షాజాద్ స్థానంలో యువ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ ఇక్రమ్‌ అలీకి జట్టులో చోటు కల్పించారు. ఇలా అనూహ్యంగా ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని పొందిన ఇక్రమ్ కు అంతర్జాతీయంగా క్రికెట్లో కేవలం రెండు  మ్యాచుల అనుభవం మాత్రమే వుంది. ఈ ఏడాది మార్చిలో డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఇక్రమ్ అరంగేట్రం చేశాడు.