ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం టీమిండియా అప్ఘానిస్థాన్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో అప్ఘాన్ జట్టు డిఫరెంట్ లుక్ లో కనిపించనుంది. సౌతాంప్టన్ వేదికన జరిగే మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాళ్లు కొత్త జెర్సీలో దర్శనమివ్వనున్నారు. నీలిరంగు మధ్యలో ఎరుపు రంగును జోడించిన ప్రత్యేకంగా రూపొందించిన జెర్సీని ధరించి అఫ్గాన్‌ ఆటగాళ్లు టీమిండియాతో తలపడనున్నారు.  

అంతర్జాతీయ జట్లన్ని తమ క్రికెట్ బోర్డు నిబంధనలకు లోబడి రూపొందించి జెర్సీలను ధరించి బరిలోకి దిగుతాయి. అయితే కొన్ని జట్ల జెర్సీలు  ఒకే రంగులో వుండి సారుప్యతను కలిగి  వున్నాయి. ఇలాంటి జట్ల మధ్య మ్యాచ్ జరిగే  సమయంలో మైదానంలోని అభిమానులే కాదు టీవిల ద్వారా వీక్షించేవారు కూడా గందరగోళానికి గురయ్యే అవకాశముంది. అందువల్లే ఐసిసి జెర్సీల మార్పు అవకాశాన్ని అన్ని జట్లకు కల్పించింది.  

అలా టీమిండియా, అప్ఘాన్ జట్ల జెర్సీలు కూడా నీలి రంగులో ఒకే విధంగా వుంటాయి. కాబట్టి శనివారం జరిగే మ్యాచ్ లో అప్ఘాన్ నీలి, ఎరుపు రంగులతో కూడిన జెర్సీలను ధరించి బరిలోకి దిగనుంది. అదేవిధంగా ఈ నెల 30న ఇంగ్లాండ్ తో జరగనున్న మ్యాచ్ లో టీమిండియా తొలిసారిగా నారింజ(ఆరెంజ్‌)  కలర్ జెర్సీతో బరిలోకి దిగనుంది. ఇక్కడ కూడా టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల జెర్సీల మధ్య సారుప్యత వుండటం వల్లే భారత ఆటగాళ్లు రెగ్యులర్ జెర్సీని ఉపయోగించలేకపోతున్నారు.