స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు మరోసారి సత్తా చాటింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ జట్టు ఈసారి భారీ విజయాన్ని అందుకుంది. మాంచెస్టర్ వేదికగా అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముందు అప్ఘాన్ బౌలర్లు నిలవలేకపోయారు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ వీరబాదుడుకు బౌలర్లంతా చేతులెత్తేయాల్సి వచ్చింది. ఇలా ఇంగ్లీష్ ఆటగాళ్ల ఊచకోతకు ప్రపంచ నెంబర్ వన్ స్పిన్నర్ గా గుర్తింపుపొందిన రషీద్ ఖానే ఎక్కువగా బలయ్యాడు.

మంగళవారం అప్ఘానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే ఆరంభంలో నెమ్మదిగానే ఆడుతూ బెయిర్ స్టో(90 పరుగులు), జో రూట్ (88 పరుగులు) లు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇలా లభించిన మంచి ఆరంభం కెప్టెన్ మోర్గాన్ రాకతో మరోస్థాయికి  చేరుకుంది. అతడు కేవలం 71 బంతుల్లోనే 148 పరుగులతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 397 పరుగుల భారీ స్కోరు చేసింది.

అయితే ఈ మ్యాచ్ లో అప్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎక్కువగా బలయ్యాడు. కనీసం ఒక్క వికెట్  కూడా తీయకుండానే 9 ఓవర్లలో ఏకంగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ప్రపంచ కప్ టోర్నీలో ఓ బౌలర్ ఇంత  ఎక్కువ పరుగులు సమర్పించచుకోవడం ఇదే మొదటిసారి. దీంతో అతడి ఖాతాలో అత్యంత చెత్త గణాంకాలు నమోదయ్యాయి.  

ఇక అప్ఘానిస్తాన్ జట్టులో కూడా ఓ వన్డేలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా రషీద్ నిలిచాడు. అంతకుముందు కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ పది ఓవర్లలో 101 పరుగులు ఇవ్వగా తాజాగా రషీద్ 9 ఓవర్లలోనే 110 పరుగులిచ్చి ఆ చెత్త రికార్డును బద్దలుగొట్టాడు. మొత్తంగా ఇంగ్లాండ్ ధనాధన్ బ్యాటింగ్ రషీద్ ఖాన్ బలిపశువుగా మారాడు.