ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న దాయాది దేశాల మధ్య మ్యాచ్ కు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఈ ఇండో పాక్ మ్యాచ్ పై అభిమానుల్లో నెలకొన్న ఆసక్తిని క్యాష్ చేసుకోవాలని కొన్ని స్పోర్ట్స్ టీవి చానల్స్ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ దేశమే ఈ మ్యాచ్ గెలుస్తుందంటూ  ఇరుదేశాల మీడియా ఊదరగొడుతోంది. తమదే గెలుపని ప్రచారం చేసుకుంటే ఫరవాలేదు కానీ ప్రత్యర్థి దేశాన్ని అవమానించేలా ఈ ప్రకటనలుండటం వివాదానికి దారితీస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ కు చెందిన ఓ చానల్ భారత వింగ్ కమాండర్ అభినందన్ ను కించపరుస్తూ ఓ యాడ్ రూపొందించింది. దీనిపై వివాదం  చెలరేగుతున్న సమయంలో భారత్ కు చెందిన ఓ సంస్థ అలాంటి పనే చేసింది. 

టీమిండియా, పాకిస్తాన్ ల మధ్య జరిగే ప్రతి ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా  ''మౌకా మౌకా'' అనే యాడ్ బాగా పాపులర్ అయ్యేది. అయితే ఈసారి ఇండో పాక్ మ్యాచ్ ఫాదర్స్ డే (జూన్ 16) రోజే జరుగుతోంది. దీంతో ఈ మ్యాచ్, ఫాదర్స్ డే రెండింటిని  టచ్ చేస్తూ ఓ యాడ్ ను రూపొందించారు. 

అందులో బంగ్లాదేశ్ జెర్సీని ధరించిన ఓ నటుడు పాకిస్థాన్ జెర్సీలోని వ్యక్తితో ఇలా అంటాడు.  '' అన్నయ్య... మరో అవకాశం ఏడవసారి వచ్చింది (భారత్ ఓడించే). ఆల్ ది బెస్ట్'' అనగా పాకిస్తాన్ జెర్సీలోని వ్యక్తి తన తండ్రి చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటాడు. '' ప్రయత్నిస్తూ వుండాలి. ప్రయత్నించే వాళ్లకు అపజయం అనేదే వుండదు. ఎప్పటికైనా ఫలితాన్ని పొందుతారు. ఈ మాటలు మన నాన్న చెప్పాడు'' అనగానే ఇండియా జెర్సీలోని వ్యక్తి ఎంటరవుతాడు. ''నోర్ముయ్ వెధవా... నేనెప్పుడు అలా అన్నాను'' అనడంతో ఈ యాడ్ ముగుస్తుంది. 

అయితే ఈ ప్రకటన ద్వారా పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను అన్నదమ్ముల్లుగా చూపించగా....వీటికి తండ్రిగా భారత్ ను చూపించారు. అలా చివర్లో ఫాదర్స్ డే రోజు తండ్రిదే విజయం అన్న అర్థం వచ్చేలా ఈ యాడ్ ను ముగించారు. అయితే ఫాదర్స్ డే రోజు ఈ మ్యాచ్ ను చూసేవారు తప్పకుండా ''బాప్ రె బాప్'' అనడం ఖాయమని సదరు చానల్ పేర్కొంది. 

ఇలా తమ దేశాన్ని కించపర్చేలా ఈ యాడ్ ను రూపొందించారంటూ పాక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే భారత అభిమానులు మాత్రం ఇందులోని క్రికెటివిటీని మాత్రమే చూడాలని...పర్సనల్ గా తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఇలా ఇండో పాక్ మ్యాచ్ కు ముందే అభిమానులు, టీవి  చానళ్ల మధ్య వార్ మొదలయ్యింది.