న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సారథ్యంలోని మన జట్టు ప్రపంచకప్‌ సాధించాలని ఢిల్లీలో అతను విద్యనభ్యసించిన విశాల్‌ భారతి పబ్లిక్‌ స్కూల్‌ అలాంటి ఓ పని చేసింది. దానిపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 

కోహ్లికి క్రికెట్‌ పాఠాలు నేర్చిన మట్టిని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్ లండన్‌ పంపించింది. టీమిండియా కెప్టెన్‌ను ఆశీర్వదించేందుకు ఉత్తమ్‌నగర్‌లోని అతని పూర్వ పాఠశాల మట్టిని పంపిందంటూ స్టార్‌ స్పోర్ట్స్‌ ట్వీట్‌ చేసింది. అంతేకాకుండా, మీరు కూడా కోహ్లిని ఆశీర్వదించండని కోరింది.

దాన్ని నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్‌ చేస్తున్నారు. ఎవరు బాబూ! ఈ అద్భుతమైన ఐడీయా ఇచ్చిందని వారంటున్నారు. మరీ ఇంత ఓవరాక్షన్‌ అవసరమా అని అడుగుతున్నారు. మట్టి పంపుతున్నారు సరే.. మరి ఆ స్కూల్‌ పరిసరాల్లో ఉన్న గాలి కూడా పంపండని అవహేళన చేశారు. 

మట్టితో పాటు గోమూత్రాన్ని కూడా పంపాలని, దాంతో స్నానం చేస్తే కోహ్లికి అతీతమైన శక్తులు వస్తాయని, అప్పుడు ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండానే అతను పరుగుల వరద పారిస్తాడని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.