ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా  జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియా అదరగొడుతున్న విషయం తెలిసిందే. భారత జట్టును ఎన్నో ఏళ్లుగా వేదిస్తున్న మిడిల్ ఓవర్ల బౌలింగ్ సమస్య యువ స్పిన్నర్లు యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్ రాకతో తీరింది. అయితే  ఆ ప్రపంచ కప్ లో చైనా మెన్ బౌలర్ కుల్దీప్ కంటే లెగ్ స్పిన్నర్ చాహలే ఉత్తమ ప్రదర్శన చేయగలుగుతున్నాడు. మొదట దక్షిణాఫ్రికాపై నాలుగు, ఆ తర్వాత ఆసిస్ పై రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటుతున్నాడు. ఇలా మైదానంలో కుల్దీప్ పై చాహల్ పైచేయి సాధిస్తుండగా తాజాగా బయటకూడా అతడిదే పేచేయిగా నిలిచింది. 

ప్రపంచ  కప్ టోర్నీలో భాగంగా భారత్ తన మూడో మ్యాచ్ న్యూజిలాండ్ తో ఆడనుంది. ఈ సందర్భంగా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ స్పిన్నర్లిద్దరు కాస్సేపు సరదాగా ఓ కాంపిటీషన్ పెట్టుకున్నారు. 

కేవలం ఒకే వికెట్ ను గురి చూసి బంతితో కొట్టాలి. అయితే ఇందుకు షరతులు వర్తిస్తాయి. కుడి చేతి బౌలర్ అయిన చాహల్ ఎడమచేత్తో....  ఎడమ చేతి వాటంగల కుల్దీప్ కుడిచేత్తో ఈ పని  చేయాలి. ఎవరు ఎక్కువసార్లు వికెట్ ను గురితప్పకుండా కొడతారో వారే విజేతలు. 

అయితే ఇలా పోటీపడ్డ స్పిన్నర్లిద్దరిలో కుల్దీప్ ఒకసారి మాత్రమే వికెట్ గురితప్పకుండా కొట్టగలిగాడు. కానీ చాహల్ మాత్రం రెండుసార్లు బంతిని నేరుగా వికెట్ కు తగిలేలా కొట్టడం ద్వారా విజేతగా నిలిచాడు. ఇలా మైదానంలోనే కాదు మైదానం బయట ఏ పోటీ అయినా తనకు ఎదురులేదని చాహల్ నిరూపించుకున్నాడు.