Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ లోనూ ప్రయోగాలు: జట్టు ఎంపికలో డొల్లతనం

అంబటి రాయుడు నాలుగో స్థానంలో చాలా మంది కన్నా బాగా రాణించాడనే విషయం అందరికీ తెలిసిందే. అంబటి రాయుడి ఆట తీరుపై వ్యాఖ్యానిస్తూ తనకు నాలుగో నెంబర్ బెంగ తీరిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. 

Team India batting order is not consistent
Author
Mumbai, First Published Jul 13, 2019, 4:30 PM IST

ముంబై: టీమిండియా ప్రపంచంలో బలమైన జట్టుగా ప్రఖ్యాతి గాంచింది. ఏ జట్టునైనా ఓడించగలదనే స్థాయికి చేరుకుంది. ప్రపంచ టోర్నీలో విజయం టీమిండియాదే అని అందరూ అనుకున్నారు కూడా. కానీ, సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ పై ఓటమి తర్వాత జట్టులోని డొల్లతనం ఒక్కటొక్కటే వెలుగు చూస్తోంది. 

టీమిండియా వన్డే జట్టులో నాలుగో స్థానంలో స్థిరంగా ఆడే బ్యాటింగ్ చేసే ఆటగాడి కోసం గత ఐదేళ్లుగా అన్వేషిస్తూనే ఉంది. అంబటి రాయుడు నాలుగో స్థానంలో చాలా మంది కన్నా బాగా రాణించాడనే విషయం అందరికీ తెలిసిందే. అంబటి రాయుడి ఆట తీరుపై వ్యాఖ్యానిస్తూ తనకు నాలుగో నెంబర్ బెంగ తీరిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. 

అనూహ్యంగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ప్రపంచ జట్టు నుంచి అంబటి రాయుడిని తప్పించి ఆ స్థానంలో విజయశంకర్ ను తీసుకున్నారు. విజయశంకర్ కు విదేశాల్లో ఆడిన అనుభవం పెద్దగా లేదు. విజయశంకర్ జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత రిజర్వ్ అటగాడిగా ఉన్న అంబటి రాయుడికి స్థానం దక్కుతుందని భావించారు. 

కానీ ఓపెనర్ అయిన మయాంక్ అగర్వాల్ కు చోటు కల్పించారు. జట్టులో చేర్చుకున్నారన్న మాటే గానీ అతన్ని బెంచీకే పరిమితం చేశారు. మిడిల్ ఆర్డర్ లో స్థిరంగా ఆడే జో రూట్, ఖవాజా లాంటి ఆటగాడిని ఎంపిక చేయడంలో బిసిసిఐ సెలెక్షన్ కమిటీ విఫలమైంది. 

ఇండియా మిడిల్ ఆర్డర్ లో స్పెషలిస్టు బ్యాట్స్ మన్ లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది. ఇండియా మ్యాచుల్లో 68 శాతం పరుగులు టాప్ ఆర్డర్ లోని ముగ్గురు బ్యాట్స్ మెన్ మాత్రమే రాబడుతూ వస్తున్నారు. ఆ తర్వాత బ్యాట్స్ మెన్ సాధించిన పరుగుల శాతం కేవలం 38 మాత్రమే. ఈ లెక్కన మిడిల్ ఆర్డర్ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

నాలుగో స్లాట్ లో స్థిరంగా ఒక్క ఆటగాడితో బ్యాటింగ్ చేయించిన సందర్భం కూడా లేదు. ముగ్గురు కూడా ఐదో స్లాట్, ఆరో స్లాట్ బ్యాట్స్ మెన్ మాత్రమే నాలుగో స్థానంలో మైదానంలోకి దిగారు. ధోనీ, రిషబ్ పంత్, హార్డిక్ పాండ్యా, దినేష్ కార్తిక్ లు నెంబర్ ఫోర్ స్లాట్ లో ఆడుతూ వచ్చారు. దీనివల్ల ఆటగాళ్లు నిలకడగా రాణించడంలో విఫలమయ్యారు. పైగా, రిషబ్ పంత్ కు వన్డేలు ఆడిన అనుభవం చాలా తక్కువ.  ప్రపంచ కప్ టోర్నీకి ముందు కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడాడు.

అయితే, రిషబ్ పంత్ కు ఆ అనుభవాన్ని ఇచ్చే అవకాశాన్ని కూడా సెలెక్టర్లు కల్పించలేదు. అవకాశం కల్పించే వెసులుబాటు ఉన్నప్పటికీ దాన్ని జారవిడిచారు. పంత్ ఇంగ్లాండు టెస్టు సిరీస్ లో ఓ సెంచరీ, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో సెంచరీ చేశాడు. ధోనీ స్థానంలో ఓ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మన్ ను భవిష్యత్తులో ఎంపిక చేసుకోవాలని అనుకున్నప్పుడు రిషబ్ పంత్ ఆశాకిరణంగా కనిపించాడు. అయితే, ఆ రెండు టెస్టు సిరీస్ ల తర్వాత జరిగిన ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు రిషబ్ పంత్ ను ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్ కు రిషబ్ పంత్ ను పరిగణనలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ భారత జట్టులో రిషబ్ పంత్ కు స్థానం కల్పించాల్సి ఉండింది. 

అలా కల్పించి ఉంటే ప్రపంచ కప్ లో అతను ఏ మేరకు ఆడగలుగుతాడనే అంచనా ఒకటి వచ్చి ఉండేది. అలా చేయకుండా, ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చినప్పుడు రిషబ్ పంత్ ను జట్టులో చేర్చుకున్నారు. ఒక ఓపెనర్ స్థానంలో మరో ఓపెనర్ ను ఎంపిక చేయడానికి బదులు రిషబ్ పంత్ ను ఎంపిక చేసి, నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు ఎంపిక చేశారు.  

ఇండియా జట్టులో ముగ్గురు స్పెషలిస్టు బ్యాట్స్ మెన్, ముగ్గురు స్పెషలిస్టు బౌలర్లు ఉన్నారు. మిగతా ఐదుగురు ఎవరనేది ప్రశ్న. వీరిలో ఓ వికెట్ కీపర్ ను తీసేస్తే మిగిలేది నలుగురు. ఈ నలుగురిలో ఎంత మంది ఆల్ రౌండర్లు అనేది ప్రశ్న. హార్ధిక్ పాండ్యానే ఆల్ రౌండర్ గా కాస్తా మెరుగుగా ఆడాడనే చెప్పాలి. కానీ బెన్ స్టోక్స్ వంటి అద్భుతమైన ఇన్నింగ్సు ఆడిన సందర్భం కూడా లేదు. నలుగురు వికెట్ల కీపర్లను తుది జట్టులోకి తీసుకున్న వైనం అందరినీ ఆశ్చర్యపరిచింది. 

న్యూజిలాండ్ పై ఓటమి తర్వాత ధోనీ ముందుగా పంపించాల్సి ఉండిందని సచిన్ టెండూల్కర్ వంటివారు కూడా అన్నారు. నెంబర్ ఫోర్ లో స్పెషలిస్టు బ్యాట్స్ మన్ లేకపోవడంతో ధోనీ స్థానం గురించి చర్చ సాగుతోంది. ధోనీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి ఉంటే సెమీ ఫైనల్లో విజయం సాధించి ఉండేవాళ్లమనే వాదన చేస్తున్నారు. కానీ, అంబటి రాయుడి వంటి నిలకడగా ఆడే ఆటగాడు నాలుగో స్లాట్ లో లేడనే విషయాన్ని వాళ్లు ఎత్తడం లేదు. 

రవీంద్ర జడేజా చేత రెండు మ్యాచులు మాత్రమే ఆడించారు. నిజానికి, అంబటి రాయుడి స్థానంలో విజయ్ శంకర్ ను ఎంపిక చేయడానికి గల కారణాన్ని వివరిస్తూ బిసిసిఐ చీఫ్ సెలెక్టర్ ఓ మాటన్నాడు. విజయ శంకర్ త్రీ డైమన్షన్ ప్లేయర్ అని, అందుకే ఎంపిక చేశామని చెప్పారు. కానీ, నిజానికి రవీంద్ర జడేజా త్రీ డైమన్షన్ ప్లేయర్. అతను బ్యాటింగ్ లో, బౌలింగులో, ఫీల్డింగ్ లో రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అతనికి విదేశీ గడ్డపై ఆడిన విశేషమైన అనుభవం కూడా ఉంది. 

బిసిసిఐ సెలెక్షన్ కమిటీలో ఐదుగురు ఎమ్మెస్కే ప్రసాద్, దేవాంగ్ గాంధీ, శరణ్ దీప్ సింగ్, జతిన్ పరాంజీ, గగన్ కొడా ఉన్నారు. వీరు మైదానంలో బ్యాట్, బంతులతో ఆడింది నామమాత్రమే. అందరు కలిసి కూడా ఆడింది కేవలం 13 టెస్టు మ్యాచులు, 31 వన్డే మ్యాచులు ఆడారు. ఒక్కొక్కరు ఎన్ని మ్యాచులు ఆడారనే లెక్క తీయాల్సే ఉంటుంది. వీరిలో ఒక్కరు కూడా ప్రపంచ కప్ ఆడినవారు కారు. వీరంతా కలిసి ప్రపంచ కప్ ఇండియా జట్టును ఎంపిక చేశారు. 

జట్టుకు క్రీడాకారులను ఎంపిక చేసే విషయంలో వారి అనుభవం ఏ మాత్రం పనికి వస్తుందనేది అసలు ప్రశ్న. వన్డే జట్టుకు మాత్రమే కాదు, టెస్టు జట్టు ఎంపిక కూడా అంత సజావుగా ఏమీ లేదు. టెస్టు జట్టు బ్యాటింగ్ విభంగాలో ఎవరి స్థానం ఎక్కడ అనేది క్రీడాకారులకు స్పష్టమైన అవగాహన లేదు.  ఛతేశ్వర పుజారా వంటి సమర్థుడైన బ్యాట్స్ మన్ కూడా తాను జట్టులో ఉంటానో, లేదో అని ఆందోళనక గురయ్యే పరిస్థితి ఉంది. 

విజయ్ శంకర్ స్థానంలో అంబటి రాయుడిని కాకుండా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడం వెనక టీమ్ మేనేజ్ మెంట్ ఒత్తిడి మాత్రమే పనిచేసింది. సెలెక్టర్ల కమిటీ పాత్ర ఇందులో ఏమీ లేదు. ఈ రకంగా చూస్తే, సెలెక్టర్ల కమిటీ బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కెప్టెన్ లేదా కోచ్ లు తమ వాదనలు వినిపించినప్పుడు తమ వాదనను కూడా ముందు పెట్టి సరైన ఆటగాళ్లను ఎంపిక చేసే స్థితి కూడా ప్రస్తుత సెలెక్టర్లకు లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది.

నిజానికి, భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ పవర్ ఫుల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. తన మాట మాత్రమే నెగ్గాలనే రీతిలో అతను వ్యవహరించేవాడు. ఆ సమయంలో బిసిసిఐ సెలెక్టర్లలో ఉన్న సంజయ్ జగదలే వంటివారు ఉండి గంగూలీని కూడా ఆలోచింపజేసే విధంగా వ్యవహరించిన సందర్భం ఉంది. ప్రస్తుతం అటువంటి సభ్యుడు సెలెక్టర్లలో ఉన్నట్లు కనిపించడం లేదు. దాంతో విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ ఆడిందే ఆటగా సాగుతూ మిడిల్ ఆర్డర్ బలహీనంగా తయారు కావడానికి కారణమయ్యారని అనిపిస్తోంది. 

చీఫ్ కోచ్ సమస్య కూడా ఇక్కడ ఉంది. గత ఐదేళ్లుగా రవి శాస్త్రి కోచింగ్ హెడ్ గా పనిచేస్తున్నాడు. టెస్టు ఓపెనర్లు, వికెట్ కీపర్లు ఎవరు అనే దానికి రవిశాస్త్రి పరిష్కారం కనుక్కోలేకపోయాడు. వన్డేల్లో నెంబర్ ఫోర్ సంగతి సరేసరి. 

Follow Us:
Download App:
  • android
  • ios