ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐసీసీ వరల్డ్ కప్ -2019 ఘనంగా ఆరంభమైంది. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్- దక్షిణాఫ్రికా మధ్య తొలి పోరు జరిగింది. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌లోనే దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ అరుదైన రికార్డును సాధించాడు.

1975 నుంచి 2015 వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో ఏ స్పిన్నర్‌కు దక్కని అవకాశం అతడికి దక్కింది. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

తొలి ఓవర్‌ను స్పిన్నరైన ఇమ్రాన్ తాహిర్‌కు అప్పగించాడు. తద్వారా 1975 నుంచి వస్తున్న ఆనవాయితీకి డుప్లెసిస్ తెరదించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన తాహిర్ తొలి ఓవర్ రెండో బంతికే ప్రమాదకర ఆటగాడు బెయిర్‌స్టోను డకౌట్ చేశాడు. 

ఏ ప్రపంచకప్‌లో ఏ బౌలర్ ఆరంభించారంటే:

* 1975లో భారత పేసర్ మదన్ లాల్ టోర్నీలోనే తొలి బంతి వేసి చరిత్రలో నిలిచిపోయాడు

* 1979లో వెస్టిండీస్ బౌలర్ ఆండి రాబర్ట్స్ ‌ భారత జట్టుపై తొలి ఓవర్ వేశాడు

* 1983లో రిచర్డ్ హ్యాడ్లీ భారత జట్టుపై తొలి ఓవర్ విసిరాడు.

* 1987లో లంక బౌలర్ వినోథెన్ జాన్ పాక్‌పై తొలి ఓవర్ వేశాడు

* 1992 ప్రపంచకప్‌లో కీవీస్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బౌలర్ క్రేయి మెక్ డెర్‌మాట్ మొదటి ఓవర్ వేశాడు

* 1996లో ఇంగ్లాండ్ బౌలర్ డోమినిక్ క్లార్క్ మొదటి ఓవర్ వేశాడు

* 1999లో ఇంగ్లాండ్ పేసర్ డారెన్ గాఫ్ ఆ ఏడాది వరల్డ్‌కప్‌ను ఆరంభించాడు.

* 2003లో దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షాన్ పొలాక్ తొలి ఓవర్‌ను వేశాడు

* 2007లో పాక్ బౌలర్ ఉమర్ గుల్ తొలి ఓవర్‌తో ప్రపంచకప్‌ను ప్రారంభించాడు

* 2011లో బంగ్లాదేశ్ బౌలర్ షఫిల్ ఇస్లాం తొలి బంతిని వేశాడు

* 2015లో శ్రీలంక సిమర్ నువాన్ కులశేఖర టోర్నీని ప్రారంభించాడు. 

వీళ్లంతా ఫాస్ట్ బౌలర్లు కాగా.. 2019 ప్రపంచకప్‌ మాత్రం స్పిన్నరైన ఇమ్రాన్ తాహిర్ ప్రారంభించడం విశేషం.