ప్రపంచ కప్ 2019 ఆరంభం నుండి ఐసిసి తీవ్ర విమర్శలకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఆరంభంలో ఇంగ్లాండ్ లో కురిసిన భారీ వర్షాల కారణంగా చాలా మ్యాచ్ లు రద్దయ్యాయి. దీంట్లో ఐసిసి తప్పులేకున్నా వరుసగా మ్యాచ్ లు రద్దవడంతో అసహనానికి గురైన అభిమానులు దానిపై విమర్శలకు దిగారు. ఇక ఈ టోర్నీలో చివర్లో కూడా ముందే నిర్ణయించిన ప్రకారం నిబంధనలకు లోబడి ఫైనల్ విజేతను ఐసిసి నిర్ణయించింది. అయితే మొదటిసారి అత్యధిక బౌండరీల  నిబంధనను ఉపయోగించిన ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. 

ఇలా ప్రతిష్టాత్మకమైన ఫైనల్ మ్యాచ్ లో ఐసిసి వ్యవహరించిన తీరు ఏకపక్షంగా వుందంటూ అభిమానులు, క్రికెట్ పండితులు విమర్శిస్తున్నారు.  ఇంగ్లాండ్-న్యూజిలాండ్ లు సమఉజ్జీలుగా నిలిచినా ఆతిథ్య జట్టును విజేతలుగా ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. గల్లీ క్రికెట్లో కూడా  ఇలాంటి నియమాలుండవని అభిమానులు ఐసిసిపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. 

ఇక వివిధ  దేశాలకు చెందిన క్రికెటర్లు, మాజీలు కూడా ఇలాంటి వివాదాస్పద నిబంధనలను మార్చాలంటూ ఐసిసికి సూచిస్తున్నారు. ఆ జాబితాలోకి టీమిండియా హిట్టర్ రోహిత్ శర్మ కూడా చేరిపోయాడు. క్రీడాస్పూర్తిని దెబ్బతీస్తూ కేవలం అదృష్టంతో విజేతలను నిర్ణయించే పలు నిబంధనల్లో మార్పులు చేపట్టాల్సిన అవసరం వుందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి  నిబంధనలపై ఐసిసి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అతడు ఐసిసికి  సూచించాడు. 

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్లో ఇరు జట్లు ఒకే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి  వచ్చింది. ఈ సూపర్ ఓవర్లో ఇరు జట్లు సమానంగా పరుగులు సాధించడంతో ఐసిసి కొత్త నిబంధన ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఏ జట్టయితే అత్యధిక బౌండరీలు బాదిందో ఆ జట్టున విజేతలుగా ప్రకటిస్తారు. ఇలా ఇంగ్లాండ్ ప్రపంచ కప్ విజేతగా  నిలవగా న్యూజిలాండ్ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐసిసి రూపొందించిన ఇలాంటి నిబంధనలు క్రీడా స్పూర్తిని దెబ్బతీస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో రోహిత్ కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.