ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. రేపు(ఆదివారం) ఆతిథ్య  ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఫైనల్ పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్ విజయవంతంగా పూర్తయ్యేలా టీమిండియా అభిమానులు సహకరించాలంటూ కివీస్ ఆలౌరౌండర్ జిమ్మీ నీషమ్  కోరాడు. ట్విట్టర్ ద్వారా భారత అభిమానులకు  నీషమ్ ఈ విధంగా అభ్యర్ధించాడు. 

''ప్రియమైన భారత క్రికట్ ఫ్యాన్స్. ఒకవేళ మీరు ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మైదానానికి రాకూడదు అనుకుంటే  ఓ పని  చేయడం. మీరు ఇప్పటికే కొనుగోలు చేసిన ఫైనల్ మ్యాచ్ టికెట్లను అధికారిక వేదికల  ద్వారానే తిరిగి ఇతరులకు అమ్మండి. వాటిని  ఇతరమార్గాల ద్వారా అమ్ముకుంటే మంచి ధర వస్తుంది కానీ అది మంచిదికాదు. నిజమైన క్రికెట్ అభిమానులకు ఆ టికెట్లు చేరాలంటే మీరు కాస్త పెద్ద మనసుతో ఆలోచించాలి. కేవలం సంపన్నులే కాకుండా సామాన్య క్రికెట్ ప్రియులు కూడా ఈ మ్యాచ్ కు వచ్చేలా సహకరించండి'' అంటే నీషమ్ ట్వీట్ చేశాడు. 

ఇంగ్లాండ్ గడ్డపై జరిగుతున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా ఆరంభం  నుండి అదరగొట్టింది. వరుస విజయాలతో జట్టు దూసుకుపోవడం, రోహిత్ శర్మ భీకరమైన ఫామ్, బుమ్రా యార్కర్లతో చెలరేగడం  ప్రతి ఒక్కరు మూడోసారి భారత్ విశ్వవిజేతగా నిలవడం ఖాయమని భావించారు. దీంతో భారత్ ట్రోఫీని  అందుకునే ఫైనల్  మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని చాలామంది భారత అభిమానులు ముందుగానే ఈ మ్యాచ్ టికెట్లను కొనుగోలుచేశారు. అయితే అందరి అంచనాలు తలకిందులై టీమిండియా సెమీస్ నుండే ఇంటిదారి పట్టింది.

ఇలా భారత ఓటమిని తట్టుకోలేక బాధతో వున్న అభిమానులు ఫైనల్ మ్యాచ్ కోసం మైదానానికి వెళ్లే ఆసక్తిని కనబర్చడం లేదు. దీంతో వారు వివిధ మార్గాల్లో తమ టికెట్లను తిరిగి అమ్మకానికి పెట్టారు.  అయితే ఆ టికెట్లను ఎక్కువ ధరకు కాకుండా సాధారణ ధరలకే ఇతరులకే అందించాలని నీషమ్ టీమిండియా అభిమానులను కోరాడు.