మాంచెస్టర్‌: పాకిస్తాన్ బౌలింగును చీల్చి చెండాడుతూ అద్భుతమైన సెంచరీ చేసిన భారత క్రికెటర్ రోహిత్ శర్మపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ పై జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 140 పరుగులు చేశాడు. 

పరుగుల వీరుడు రోహిత్ శర్మపై సోషల్‌ మీడియాలో  ప్రశంసల వర్షం కురుస్తోంది. పాపం పాకిస్థాన్‌ బౌలర్లపై "వింగ్‌ కమాండర్‌ రోహిత్‌ శర్మ" సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేశాడని, దీంతో ఆ జట్టు కోలుకోలేకపోయిందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

వింగ్‌ కమాండర్ రోహిత్‌ అంటూ అద్భుతమైన మీమ్స్‌ను పోస్టు చేస్తున్నారు.  పాక్‌ యుద్ధ విమానాల్ని వెంటాడుతూ.. ఆ దేశ భూభాగంలోకి వెళ్లిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ పాకిస్తాన్ గడ్డపై కాలుమోహి వీరోచితంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ సందర్భంగా అభినందన్‌ను కించపరుస్తూ.. భారత క్రికెటర్లను అవమానిస్తూ.. పాకిస్థాన్‌లో యాడ్‌ రూపొందించిన విషయం కూడా తెలిసిందే. 

ఈ నేపథ్యంలో పాక్‌ బౌలర్లను ఆటాడుకున్న రోహిత్‌ శర్మను వింగ్‌ కమాండర్‌ అభినందన్‌తో పోలుస్తూ.. నెటిజన్లు వ్యాఖ్యలు, మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు.  పుల్వామా దాడి ఘటన తర్వాత తొలిసారి పాకిస్తాన్ పై భారత్ తలపడుతుండటంతో ఆర్మీ జవాన్లు సైతం సంబరాలు చేసుకున్నారు. కమాన్‌ ఇండియా అంటూ ప్రోత్సహిస్తున్నారు.