భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఇండియన్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల మోదీ మాల్దీవులు పర్యటన సందర్భంగా  ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహం మొహ్మద్ కు క్రికెట్ బ్యాట్ బహూకరించిన విషయం తెలిసిందే. ఇలా ప్రపంచ కప్ ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లందరి సంతకాలతో కూడిన ఈ బ్యాట్ బహూకరిస్తూ మోదీ నెరిపిన ''క్రికెట్ దౌత్యం'' పై సచిన్  ట్విట్టర్ ద్వారా స్పందించారు. 

ప్రపంచ వేదికపై స్వయంగా ప్రధాని మోదీ  క్రికెట్ కు ప్రచారం కల్పించడం అభినందనీయమని సచిన్ పేర్కొన్నారు. '' క్రికెట్ ను ప్రమోట్ చేసినందుకు నరేంద్ర మోదీకి  కృతజ్ఞతలు. ప్రపంచ కప్ జరుగుతున్న సమయంలోనే ఈ అద్భుత సంఘటన  జరగడం క్రికెట్ అభ్యున్నతికి మంచి ఉదాహరణ. భవిష్యత్ లో మాల్దీవులు కూడా క్రికెట్ ఆడుతున్న దేశాల సరసన చేరుతుందని ఆశిస్తున్నా'' అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. 

ప్రధాని మోదీ రెండోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట మాల్దీవుల పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం కు క్రికెట్ అంటే ఇష్టమని తెలిసి ఓ ప్రత్యేకమైన బ్యాట్ ను అతడికి బహూకరించాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ ఈ విధంగా ట్వీట్ చేశాడు. ''  క్రికెట్ దౌత్యం... నా స్నేహితుడు, ప్రెసిడెంట్ ఇబ్రహీం గొప్ప క్రికెట్ అభిమాని. కాబట్టి అతడికి భారత ప్రపంచ కప్ జట్టు సంతకాలు చేసిన బ్యాట్ ను బహూకరిస్తున్నా'' అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పైనే సచిన్ తాజాగా స్పందించాడు.