స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ తన చిరకాల కోరికను నెరవేర్చుకుంది. క్రికెట్ కు పుట్టినిల్లయిన ఆ దేశానికి ఇన్నేళ్లు వరల్డ్ కప్ ట్రోఫీ అనేది అందని ద్రాక్షలా మిగిలిపోయింది. కానీ తాజాగా ఆ జట్టు లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడగలిగింది. ఇలా ఈ మెగా టోర్నీలో ఆతిథ్య జట్టును విజేతగా నిలబెట్టిన ఘనత బెన్ స్టోక్స్ కు దక్కుతుంది. ఫైనల్లో అతడు ఓ వైపు సహచరులు వరుసగా వికెట్లు కోల్పోతున్నా సమయోచితంగా బ్యాటింగ్ చేసి 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయం వైపు నడిపించాడు.

అయితే ఇలా ఇంగ్లాండ్  గెలుపుకు కారణమైన స్టోక్స్ పై ప్రశంసలు జల్లు కురుస్తోంది. కేవలం ఇంగ్లాండ్ క్రికెట్ ప్రియులే కాదు ప్రపంచ వ్యాప్తంగా వున్న క్రికెట్ అభిమానులు స్టోక్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాంటిది అతడి తల్లిదండులు ఆనందం మరోస్థాయిలో వుంటుందని మనం భావిస్తాం. అయితే స్టోక్స్ తల్లిదండ్రుల పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. 

 సొంత దేశాన్ని ఓడించిన స్టోక్స్:

స్టోక్స్ అద్భుతంగా ఆడి  ఇంగ్లాండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చాలా ఆనందాన్నిచ్చిందని బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ పేర్కొన్నాడు. కానీ తాము పుట్టిన దేశమైన న్యూజిలాండ్ ప్రపంచ కప్ ట్రోఫీకి వరుసగా రెండోసారి మిస్సవడం బాధించిందన్నాడు. ఓ వైపు స్టోక్స్ ఆటతీరుతో ఆనందం,  మరోవైపు కివీస్ ఓటమితో బాధ ఒకేసారి కలిగించిన ఈ ఫైనల్ తనకు జీవితాంతం గుర్తిండిపోతుందని గెరార్డ్ స్టోక్స్ తెలిపారు. 

ఇకపై తమ స్వదేశంలో అత్యధిక  ప్రజలు అసహ్యించుకునే తండ్రిని తానే కాబోతున్నానేమో అనిపిస్తోంది.  ట్రోఫీతో స్వదేశానికి వెళ్లాల్సిన కివీస్ తన కొడుకు వల్లే ఉత్త చేతులతో వెళుతోంది. ఇలా  స్టోక్స్ ఇంగ్లాండ్ ను గెలిపించినందుకు ఆనందిస్తున్నా... న్యూజిలాండ్ ఓడించినందుకు బాధ పడుతున్నానని గెరార్డ్ తన వింత పరిస్థితి  గురించి వివరించారు.