ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. దక్షిణాఫ్రికాపై 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ అసలు సిసలు మ్యాచ్ విన్నర్‌ ఎలా ఉంటాడో చూపించాడు.

బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ అద్భుత ప్రతిభ కనబరిచాడు. అన్నింటికి మించి మ్యాచ్‌లో అతను అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ స్టేడియంలో అరుపులు పుట్టించింది. అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఆండిల్ ఫెహ్లుకోవియా భారీ షాట్‌ కొట్టాడు.

దానిని బౌండరీ లైన్ వద్ద వున్న స్టోక్స్ అందుకున్నాడు. ఒంటి చేత్తో సూపర్‌మ్యాన్‌లా బంతిని ఒడిసిపట్టి ఈ వరల్డ్ కప్ బెస్ట్ క్యాచ్ జాబితాలో అప్పుడే చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం స్టోక్స్ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.