బర్మింగ్‌హామ్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారంనాడు జరిగిన మ్యాచులో మహేంద్ర సింగ్ ధోనీ, కేదార్ జాదవ్ బ్యాటింగ్ తీరుపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో ఓటమి దిశగా టీమిండియా బ్యాటింగ్ సాగుతున్న సందర్భంలో కామెంట్రీ బాక్స్‌లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్, టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ ఉన్నారు. వారి మధ్య ఆ సమయంలో ఆసక్తికర సంభాషణ జరిగింది. 

తాను పూర్తిగా అయోమయానికి గురయ్యానని, ఏం జరుగుతుందో తెలియడం లేదని నాజర్ వ్యాఖ్యానించాడు. టీమిండియాకు కావాల్సింది ఇది కాదని, వాళ్లకు మరిన్ని పరుగులు అవసరమని అన్నాడు. అలాంటి సందర్భంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్స్ ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.

 కొంతమంది భారత అభిమానులు గ్యాలరీ నుంచి ఇప్పటికే వెళ్లిపోతున్నారని, ధోనీ నుంచి వాళ్లు ఈ ఆటతీరును ఆశించలేదని, ధోనీ మార్క్ షాట్స్ ఆశించారని చెప్పాడు.
 
నాజిర్ హుస్సేన్ వ్యాఖ్యలకు గంగూలీ స్పందించారు. ఈ ఆటతీరు గురించి చెప్పడానికి తన దగ్గర ఎలాంటి వివరణ లేదని అన్నాడు. ధోనీ, జాదవ్ తీస్తున్న సింగిల్స్ గురించి తన వద్ద సమాధానం లేదని అన్నాడు. ఐదు వికెట్లు చేతిలో ఉండగా 338 పరుగులు చేయలేని స్థితిలో భారత బ్యాట్స్‌మెన్స్ ఉన్నారని గంగూలీ మండిపడ్డాడు. 

ఎంఎస్ ధోనీ సింగిల్స్ తీస్తూ స్లోగా బ్యాటింగ్ చేయడంపై గంగూలీ పరోక్ష విమర్శలు చేశాడు. ఇండియా 300 పరుగులకు ఆలవుటైనా తాను బాధపడేవాడిని కాదని, కానీ 5వికెట్లు చేతిలో ఉండగా కూడా ఇలా ఆడటమేమిటని గంగూలీ అన్నాడు.