ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లో కోహ్లీసేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆడిన మూడు మ్యాచుల్లోను అద్భుతమైన ఆటతీరును కనబర్చి సెమీస్ కు దగ్గరయ్యింది. ఇలా జట్టును ముందుండి సమర్థవతంగా నడుపుతున్న కెప్టెన్ కోహ్లీ పై అభిమానులు, మాజీల నుండి ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇలా కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తుతున్న వారి జాబితాలోకి ఆసిస్ ఆటగాడు స్మిత్ చేరిపోయాడు. 

కోహ్లీ ఓ సక్సెస్ ఫుల్ కెప్టెన్ మాత్రమే కాదు మంచి వ్యక్తిత్వాన్ని కలిగిన ఆటగాడని స్మిత్ ప్రశంసించాడు. మైదానంలో అతడి దూకుడు చాలా మంది అతడి గురించి అపార్థం చేసుకుంటారని... కానీ ఒక్కసారి దగ్గరనుండి చూస్తే అతడేంతో అర్థమవుతుందని తెలిపాడు. ఇటీవల టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో తనకోసం అతడు చేసిన పనిని తానెప్పటికి మరిచిపోలేనని స్మిత్ పేర్కొన్నాడు.

కొద్దిరోజుల క్రితం భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా జరిగిన సంఘటనను ఓ ఇంగ్లీష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్మిత్ గుర్తుచేసుకున్నాడు. ''టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో నేను బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాను. ఆ సమయంలో కొందరు భారత అభిమానులు తనను అవమానించేలా కామెంట్ చేయడం ఆరంభించారు. చీటర్...చీటర్ అంటూ పెద్దపెట్టున తనను ఉద్దేశిస్తూ అరిచారు.  అయితే దీన్ని గమనించిన కోహ్లీ తనకేమీ సంబంధం లేకున్నా సొంత దేశానికి అభిమానులను మందలించాడు. ఇలా అతడు ప్రవర్తించడంతో తాను ఒక్కాసారిగా ఆశ్యర్యానికి గురయ్యాను. 

అయితే ఎవరు నన్ను ఎగతాళి చేసినా నేను పట్టించుకోను. అలాగే భారత అభిమానుల అరుపులను కూడా నేను పట్టించుకోలేదు. కానీ కోహ్లీ తన కోసం  ఎంతగానో ఇష్టపడే అభిమానులను నొప్పించాడు. దీని వల్ల అతడికి లాభం కంటే నష్టమే ఎక్కువ. అయినా అతడు నాకోసం అలా చేయడాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. కోహ్లా వ్యక్తిత్వానికి నేను ఫిదా అయిపోయాను''  అని స్మిత్ వెల్లడించాడు.