బర్మింగ్‌హామ్‌: న్యూజిలాండును 119 పరుగుల తేడాతో ఓడించి ఆతిథ్య ఇంగ్లాండు సెమీ ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. 1992 తర్వాత తొలిసారి సెమీ ఫైనల్ కు చేరుకున్న ఇంగ్లాండు ప్రపంచ కప్ పై కన్నేసింది. పాయింట్ల పట్టికలో ఇంగ్లాండు మూడో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అగ్ర స్థానంలో నిలువగా, ఇండియా రెండో స్థానంలో నిలిచింది.

ప్రస్తుత స్థితిలో నిబంధనల ప్రకారం సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండుకు, ఇండియాకు మధ్య జరిగే అవకాశం ఉంది. న్యూజిలాండ్ నాలుగో స్థానం పొందే అవకాశం ఉంది. దీంతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఇండియాకు, ఇంగ్లాండుకు మధ్య పడుతుందని ఇంగ్లాండు మాజీ మైఖెల్ వాన్ అంచనా వేశారు. 

అద్భుతమైన పెర్ ఫార్మెన్స్, కొద్ది రోజులుగా సమర్థమైన బౌద్ధిక బలాన్ని ప్రదర్శించారని, ఇండియాను బర్మింగ్ హామ్ కు తెండి అని వాన్ ఇంగ్లాండు జట్టును ఉద్దేశించి ట్వీట్ చేశాడు. దానిపై నెటిజన్లు ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేస్తున్నారు. 

 

ఇంగ్లాండు జూన్ 11వ తేదీన రెండో సెమీ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియాను లేదా ఇండియాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండు జట్లలో ఏది రెండో స్థానంలో నిలిస్తే దానిపై మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. వాన్ అంచనాతో కొందరు క్రికెట్ అభిమానులు ఏకీభవిస్తుండగా, మరి కొందరు తోసిపుచ్చుతున్నారు. 

ట్వీట్ ను సేవ్ చేసుకుని పెట్టుకోవాలని, తుది మ్యాచుల్లో ఆస్ట్రేలియా ఓటమి పాలై ఇండియా విజయం సాధిస్తుందని వాన్ ను ఉద్దేశించి కొంత మంది ట్వీట్ చేస్తున్నారు.

లీగ్ మ్యాచుల్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఓడిపోతుందని, శ్రీలంకపై భారత్ గెలుస్తుందని, అందువల్ల సెమీ ఫైనల్ ఇంగ్లాండు ఆస్ట్రేలియాపై ఆడాల్సి వస్తుందని కొంత మంది అంటున్నారు. 

 

తాము సెమీ ఫైనల్ కు చేరుకోవడం పట్ల ఇంగ్లాండు కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ ఆనందం వ్యక్తం చేసాడు. బర్మింగ్ హామ్ లో ఇండియాను తాము ఓడించామని, అదే మైదానంలో తాము సెమీ ఫైనల్ ఆడబోతున్నామని ఆయన అన్నాడు.