జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ తీవ్ర అనారోగ్యం...  పెద్ద పేగు, లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్న జింబాబ్వే మాజీ ఆల్‌రౌండర్.. 

జింబాబ్వే లెజెండరీ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 49 ఏళ్ల హీత్ స్ట్రీక్, ప్రస్తుతం స్టేజ్ 4 పెద్ద పేగు, లివర్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడని సమాచారం. జోహన్‌బర్గ్‌లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హీత్ స్ట్రీక్‌ ఆరోగ్య పరిస్థితి గురించి జింబాబ్వే ఆల్‌రౌండర్ సీన్ విలియమ్స్ తెలియచేశాడు..

‘హీత్ స్ట్రీక్ స్టేజ్ 4 క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్న ఆయన కుటుంబం వెంటనే లండన్‌కి రావాల్సిందిగా సమాచారం పంపారు. దీని గురించి పూర్తి వివరాలు నాకు తెలీదు. నేను హీత్ స్ట్రీక్‌కి మెసేజ్ చేశాను, ఆయన రిప్లై కూడా ఇచ్చారు...

అయితే ఈ సమయంలో ఆయన కుటుంబానికి కాస్త ప్రైవసీ కావాలి. గత ఏడాది ఆయన్ని ఫిషింగ్ చేస్తుండగా చూశాను. ఇప్పుడు ఇలా అయ్యిందంటే క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తున్నట్టు ఉంది.. 

హీత్ స్ట్రీక్ నాకు మెంటర్. ఆయన ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు. నా జీవితాన్ని, నా కెరీర్‌ని కాపాడిన దేవుడు. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నా...’ అంటూ ట్వీట్ చేశాడు జింబాబ్వే ఆల్‌రౌండర్ సీన్ విలియమ్స్...

Scroll to load tweet…


‘హీత్ స్ట్రీక్, జింబాబ్వే గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకరు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉంది. మీరంతా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి...’ అంటూ జింబాబ్వే మాజీ విద్యా శాఖ మంత్రి డేవిడ్ కోల్టర్డ్ ట్వీట్ చేశారు..

జింబాబ్వే తరుపున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడిన హీత్ స్ట్రీక్... తన కెరీర్‌లో 216 టెస్టు వికెట్లు, 239 వన్డే వికెట్లు పడగొట్టారు. అంతేకాకుండా బ్యాటుతో టెస్టుల్లో 1990 పరుగులు, వన్డేల్లో 2943 పరుగులు చేసి ఆల్‌రౌండర్‌గా అదరగొట్టారు.

జింబాబ్వే తరుపున టెస్టుల్లో 100 వికెట్లు తీసిన మొట్టమొదటి, ఏకైక బౌలర్‌గా నిలిచిన 
హీత్ స్ట్రీక్.. వన్డేల్లో 100 వికెట్లు తీసిన నలుగురు జింబాబ్వే బౌలర్లలో ఒకరు. అంతేకాకుండా వన్డే, టెస్టుల్లో 1000కి పైగా పరుగులు, 100కి పైగా వికెట్లు తీసిన ఏకైక జింబాబ్వే ప్లేయర్‌గానూ రికార్డు క్రియేట్ చేశారు హీత్ స్ట్రీక్...

జింబాబ్వే క్రికెట్ టీమ్ ఇప్పుడంటే పసికూనగా మారింది కానీ ఒకప్పుడు టాప్ టీమ్స్‌కి కూడా చుక్కలు చూపించింది. 1997-2002 మధ్య సంచలన విజయాలు అందుకుంది జింబాబ్వే. ఈ సమయంలో జింబాబ్వే టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు హీత్ స్ట్రీక్.