49 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచిన హీత్ స్ట్రీక్.. ఆగస్టు 23న హీత్ స్ట్రీక్ చనిపోయాడంటూ పుకార్లు, తానే బతికే ఉన్నానంటూ ప్రకటించిన జింబాబ్వే లెజెండ్.. 10 రోజులకే...
ఆగస్టు 23న జింబాబ్వే క్రికెట్ లెజెండ్ హీత్ స్ట్రీక్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌తో సహా చాలా మంది ఈ వార్త నిజం అనుకుని, హీత్ స్ట్రీక్‌ని నివాళి ఘటించారు. అయితే తాను చనిపోలేదని, ఇలా మధ్యలోనే రనౌట్ చేయవద్దని హీత్ స్ట్రీక్ స్పందించి... రూమర్లకు చెక్ పెట్టాడు.
అయితే ఇది జరిగిన 10 రోజులకే ఈ పుకారు నిజమైంది. కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న హీత్ స్ట్రీక్, సెప్టెంబర్ 3న గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఈ వార్తని ఆయన భార్య నదీన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు...
‘ఈరోజు తెల్లవారుజామున, ఆదివారం సెప్టెంబర్ 3, 2023 నా జీవితంలో గొప్ప ప్రేమని అందించిన ప్రేమికుడు. మా పిల్లలకు అందమైన తండ్రి స్వర్ణానికి పయనమయ్యారు. ఆయన తన చివరి రోజుల్లో కుటుంబంతో గడపాలని అనుకున్నారు. మాకు అమూల్యమైన ప్రేమను కానుకగా ఇచ్చి, మమ్మల్ని విడిచి వెళ్లారు. ఆయన ఆత్మ ఎప్పటికీ మా కుటుంబంతోనే ఉంటుంది... ’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది నదీన్ స్ట్రీక్..
జింబాబ్వే తరుపున 65 టెస్టులు, 189 వన్డేలు ఆడిన హీత్ స్ట్రీక్, 4933 పరుగులు, 455 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే తరుపున 1000కి పైగా పరుగులు, 100కి పైగా వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్‌గా ఉన్నాడు హీత్ స్ట్రీక్. వన్డేల్లో 2 వేలకు పైగా పరుగులు, 200లకుపైగా వికెట్లు తీసిన ఏకైక జింబాబ్వే ప్లేయర్ కూడా హీత్ స్ట్రీకే...
1974, మార్చి 16న జన్మించిన హీత్ స్ట్రీక్, 1993 డిసెంబర్‌లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు. పాకిస్తాన్‌తో రావల్పిండిలో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు హీత్ స్ట్రీక్. 2005లో తన 31 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఈ జింబాబ్వే మాజీ లెజెండరీ క్రికెటర్..
జింబాబ్వేకి కోచ్‌గా కూడా వ్యవహరించిన హీత్ స్ట్రీక్, జింబాబ్వే క్రికెట్ బోర్డు తనకి చెల్లించాల్సిన మొత్తం గురించి కోర్టుని ఆశ్రయించాడు. 2021లో అవినీతి ఆరోపణలతో హీత్ స్ట్రీక్‌పై 8 ఏళ్ల నిషేధం విధించింది ఐసీసీ.
జింబాబ్వే కెప్టెన్‌గా 4 టెస్టు విజయాలు, 18 వన్డే విజయాలు అందుకున్న హీత్ స్ట్రీక్, జింబాబ్వేకి మోస్ట్ సక్సెస్‌ఫుల్ టెస్టు కెప్టెన్‌గా, రెండో మోస్ట్ సక్సెస్‌ఫుల్ వన్డే కెప్టెన్‌గా ఉన్నాడు.
