ఐసిసి(ఇంటర్నేషనల్ క్రికెట్  కౌన్సిల్) తీసుకున్న ఒక్క నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ ను కుదిపేసింది. అంతర్జాతీయ క్రికెట్ నుండి ఓ జట్టును తొలగిస్తూ ఐసిసి సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే క్రికెట్ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువవడంతో సతమతమవుతున్న జింబాబ్వే జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ జట్టు హోదాను తొలగిస్తూ ఐసిసి షాకిచ్చింది. దీంతో ఆ దేశ క్రికెటర్ల భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. 

జింబాబ్వే క్రికెటర్లకు అశ్విన్ ఓదార్పు

జింబాబ్వే టీం అంతర్జాతీయ క్రికెట్ నుండి నిషేధానికి గురవడంపై టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఆవేధన వ్యక్తం చేశాడు. '' ఈ నిషేద వార్త విని జింబాబ్వే క్రికెటర్లు, అభిమానుల గుండె పగిలి వుంటుంది. దీనిపై ఆ దేశ క్రికెటర్ సికిందర్ రజా చేసిన ట్వీట్ ద్వారా వారెంత ఆవేధనతో వున్నారో అర్థమవుతుంది. వారందరి జీవితాలు ఒక్క నిర్ణయంతో రోడ్డునపడ్డాయి. నాకెంతో ప్రియమైన జింబాబ్వే జట్టు  పూర్వవైభవాన్ని సంతరించుకుని తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా.'' అంటూ అశ్విన్ ట్వీట్ చేశాడు. 

జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రజా ఆవేధన

అంతకుముందు జింబాబ్వే ఆటగాడు సికిందర్‌ రజా తన ఆవేదనంతా ఓ ట్వీట్ ద్వారా బయటపెట్టాడు. ''ఎలా ఒక్క నిర్ణయం మా జట్టును చీకట్లోకి నెడుతుంది. ఎలా ఓ నిర్ణయం చాలా మందిని నిరుద్యోగులుగా మారుస్తుంది. ఎలా ఓ నిర్ణయం చాలా కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. ఎలా ఓ నిర్ణయం చాలా మంది కెరీన్ ను నాశనం  చేస్తుంది. నేను మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కు ఇలా గుడ్ బై చెప్పాలని అనుకోలేదు.'' అంటూ తన హృదయంలో దాగున్న బాధను బయటపెట్టాడు. 

అయితే ఈ ట్వీట్ పైనే స్పందిస్తూ అశ్విన్ ట్వీట్ చేశాడు. ఇలా తమకు మద్దతుగా నిలిచిన అశ్విన్ కు రజా కృతజ్ఞతలు తెలిపాడు. మీ సహకారం మాకు చాలా అవసరమంటూ అశ్విన్ ట్వీట్ కు రజా సమాధానమిచ్చాడు. 

జింబాబ్వే నిషేధానికి కారణాలు:

జింబాబ్వే జట్టు నిషేధానికి  గురవడానికి ఆ దేశ ప్రభుత్వమే కారణం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జింబాబ్వే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం మరీ ఎక్కువయ్యింది. దీంతో ఐసిసి నిబంధనల్లోని ఆర్డికల్ 2.4(సి), (2.4(డి) ని అతిక్రమించినందుకు నిషేదాన్ని విధిస్తూ  కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఐసిసి ప్రకటించింది.