విండీస్‌పై 35 పరుగుల తేడాతో సంచలన విజయం అందుకున్న జింబాబ్వే... సికందర్ రజా ఆల్‌రౌండ్ షో! సూపర్ 6 రౌండ్‌కి వెస్టిండీస్, జింబాబ్వే, నెదర్లాండ్స్..
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో వెస్టిండీస్‌కి ఊహించని షాక్ తగిలింది. 2022 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌ని ఓడించిన జింబాబ్వే, క్వాలిఫైయర్స్‌లో విండీస్‌పై 35 పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది. దీంతో రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ విజేతగా ఉన్న వెస్టిండీస్, ఈసారి ప్రపంచకప్‌కి అయినా అర్హత సాధించడం కూడా అనుమానంగానే మారింది..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 268 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ 58 బంతుల్లో 7 ఫోర్లతో 47 పరుగులు చేయగా గుంబీ 26, సీన్ విలియమ్స్ 23 పరుగులు చేశారు. ఆల్‌రౌండర్ సికందర్ రజా 58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా రియాన్ బర్ల్ 57 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు..
విండీస్ బౌలర్లు కీమో పాల్‌కి 3 వికెట్లు దక్కగా అల్జెరీ జోసఫ్, అకీల్ హుస్సేన్ రెండేసి వికెట్లు తీశారు. 269 పరుగుల లక్ష్యఛేదనలో 233 పరుగులకే ఆలౌట్ అయిన వెస్టిండీస్, 35 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది.
బ్రెండన్ కింగ్ 12 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు చేయగా కేల్ మేయర్స్ 56 పరుగులు చేశాడు. షై హోప్ 30 పరుగులు చేయగా నికోలస్ పూరన్ 34, రోస్టన్ ఛేజ్ 44 పరుగులు చేశారు. జాసన్ హోల్డర్ 19 పరుగులు మినహా బ్యాటర్లు ఎవ్వరూ సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేకపోయారు..
జింబాబ్వే బౌలర్ టెండాయ్ ఛతరా 3 వికెట్లు తీయగా బ్లెస్సింగ్ ముజరబానీ, రిచర్డ్ గవారా, సికందర్ రాజా రెండేసి వికెట్లు తీశారు. మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్ 1975, 1979 టోర్నీల్లో విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్, ఆ తర్వాతి 1983 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా చేతుల్లో ఓడింది. అక్కడి నుంచి వెస్టిండీస్ క్రికెట్ టీమ్ వైభవం మసకబారుతూ వచ్చింది..
రెండు సార్లు టీ20 వరల్డ్ కప్స్ కూడా సాధించిన వెస్టిండీస్, 2022 పొట్టి ప్రపంచకప్ టోర్నీలో గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించి, ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది.. జింబాబ్వే చేతుల్లో ఓడినా వెస్టిండీస్, సూపర్ 6 రౌండ్‌కి అర్హత సాధించింది.
ఈ విజయంతో గ్రూప్ Aలో మూడు మ్యాచుల్లో మూడు విజయాలు అందుకున్న జింబాబ్వే, 6 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా సూపర్ సిక్సర్స్ గ్రూప్‌కి అర్హత సాధించింది. వెస్టిండీస్, నెదర్లాండ్స్ కూడా 3 మ్యాచుల్లో రెండేసి విజయాలతో 4 పాయింట్లు సాధించి... సూపర్ సిక్సర్స్ గ్రూప్‌కి దూసుకెళ్లాయి..
గ్రూప్ B నుంచి శ్రీలంక, స్కాట్లాండ్, ఓమన్ జట్లు సూపర్ సిక్సర్స్ రౌండ్‌కి అర్హత సాధించే అవకాశాలు ఎక్కుడగా ఉన్నాయి, ఈ మూడు జట్లు కూడా రెండేసి విజయాలు సాధించాయి... మూడు మ్యాచుల్లోనూ ఓడిన యూఏఈ ఇప్పటికే సూపర్ 6 రౌండ్ రేసు నుంచి తప్పుకున్నాయి..
వరుసగా 2 మ్యాచుల్లో ఓడిన ఐర్లాండ్, మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే సూపర్ 6 రౌండ్‌కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది.
