Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియాకి దిమ్మతిరిగే షాక్... జింబాబ్వే చేతుల్లో చిత్తు! డేవిడ్ వార్నర్ ఒంటరిపోరాటం చేసినా...

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని ఓడించిన జింబాబ్వే... వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో గెలిచిన ఆసీస్... డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం వృథా... 

Zimbabwe beats Australia in Australia for the first time in history
Author
First Published Sep 3, 2022, 3:58 PM IST

క్రికెట్ ప్రపంచంలో రెండు దశాబ్దాలకు పైగా తిరుగులేని ఆధిపత్యం సాగించింది ఆస్ట్రేలియా. నాలుగు వన్డే వరల్డ్ కప్ టైటిల్స్ గెలిచిన ఆసీస్‌తో వన్డే మ్యాచ్ ఆడాలంటే... మిగిలిన జట్లకు వణుకు పుట్టేది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది... పసికూన జింబాబ్వే చేతుల్లో చిత్తుగా ఓడింది ఆస్ట్రేలియా... జింబాబ్వేతో సిరీస్ కదా అని ఆస్ట్రేలియా జట్లు స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి, బీ టీమ్‌తో బరిలో దిగిందని అనుకునేరు. అలా ఏం కాదు... డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఆరోన్ ఫించ్, గ్లెన్ మ్యాక్స్, స్టోయినిస్ వంటి స్టార్ ప్లేయర్లు అందరూ ఉన్న టీమ్‌ని ఓడించి, సంచలనం క్రియేట్ చేసింది జింబాబ్వే... 

 టీమిండియాతో స్వదేశంలో వన్డే సిరీస్ ముగించుకున్న జింబాబ్వే, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. మొదటి రెండు వన్డేల్లో ఘన విజయాలు అందుకున్న ఆస్ట్రేలియాకి, మూడో వన్డేలో దిమ్మతిరిగే షాక్ తగిలింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు, 31 ఓవర్లలో 141 పరుగులకి ఆలౌట్ అయ్యింది...

జింబాబ్వే ఆల్‌రౌండర్ రియాన్ బర్ల్ 5 వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాసించాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ 5 పరుగులు చేసి అవుట్ కావడంతో 9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత స్టీవ్ స్మిత్ 1, ఆలెక్స్ క్యారీ 4, మార్కస్ స్టోయినిస్ 3, కామెరూన్ గ్రీన్ 3 పరుగులు చేసి అవుట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా...

72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాని ఆదుకునే ప్రయత్నం చేశారు గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్. 22 బంతుల్లో 3 ఫోర్లతో 19 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, డేవిడ్ వార్నర్‌తో కలిసి ఆరో వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత అస్టన్ అఘర్ డకౌట్ కాగా, మిచెల్ స్టార్క్ 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో బౌండరీల మోత మోగించాడు డేవిడ్ వార్నర్...

96 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 94 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, సెంచరీకి చేరువైన సమయంలో రియాన్ బర్ల్ బౌలింగ్‌లో బ్రాడ్ ఎవెన్స్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా 141 పరుగులు చేస్తే, అందులో డేవిడ్ వార్నర్ చేసిన పరుగులు 94...అంటే టీమ్ స్కోరులో వార్నర్ భాయ్ వాటా 71.2 శాతం. 

రియాన్ బర్ల్ 3 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 142 పరుగుల లక్ష్యాన్ని 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది జింబాబ్వే. కైటానో 19, మరుమని 35, కెప్టెన్ రగిస్ చకబవా 37, టోనీ మన్యోంగ 17, రియాన్ బర్ల్ 11 పరుగులు చేసి జింబాబ్వే విజయంలో తమ వంతు పరుగులు జోడించారు...

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాని ఓడించడం జింబాబ్వేకి ఇదే మొట్టమొదటిసారి. అయితే ఓవరాల్‌గా జింబాబ్వేకి ఆస్ట్రేలియాపై మూడో విజయం. ఇంతకుముందు సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే జింబాబ్వే, , 1983 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై తొలి మ్యాచ్‌లోనే 13 పరుగుల తేడాతో విజయం అందుకుంది...

2014లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య  నిర్వహించిన ముక్కోణపు సిరీస్‌లో ఆసీస్‌పై 3 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది జింబాబ్వే... 

Follow Us:
Download App:
  • android
  • ios