టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్  సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇప్పటికు ఫామ్ లేమి కారణంగా జట్టుకు దూరమైన అతడు అంతర్జాతీయ క్రెకెట్ కు నుండి వైదొలగుతున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా భారతీయ క్రికెట్లో అలజడి మొదలయ్యింది. 

యువరాజ్ సింగ్ చివరిసారిగా భారత జట్టు తరపున 2017 వెస్టిండిస్ తో చివరి వన్డే ఆడాడు.  అలాగే 2012  లో తన చివరి టెస్ట్ ఆడాడు. అయితే ప్రస్తుతం టీమిండియా  జట్టులో యువకులు అత్యుత్తమంగా రాణిస్తుండటంతో మళ్లీ జట్టులో చోటు దక్కదని భావించే అతడీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అనూహ్యంగా ఇలా రిటైర్మెంట్ ప్రకటన చేస్తాడని ఎవరూ ఊహించలేదు. 

2003 లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన యువరాజ్ 2017  వరకు జట్టులో కొనసాగాడు. ఇలా అతడు టీమిండియా తరపున  304 వన్డేలు, 40 టెస్టులు, 58 టీ20 లు ఆడాడు. అయితే 2007 తర్వాత అతడు కేవలం  ఐపిఎల్ కే పరిమితమయ్యాడు. అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 

2007 లో ధోనిసేన టీ20 వరల్డ్ కప్ సాధించడంలో యువరాజ్ ప్రముఖ పాత్ర వహించాడు. ఈ టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ధనా ధన్ ఇన్నింగ్స్ ద్వారా యువరాజ్ పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఈ మ్యాచ్ లో అతడు ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ ను చీల్చి చెండాడుతూ ఒకే ఓవర్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. ఇలా అతడి విధ్వంసం ముందు  ఇంగ్లాండ్ బౌలర్లు చేతులెత్తుశారు. 

ఆ తర్వాత 2011 లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో కూడా యువరాజ్ దే ప్రముఖ పాత్ర. అతడు ఈ టోర్నీలో 362 పరుగులు, 15 వికెట్లతో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి భారత్ కు రెండో ప్రపంచ కప్ అందించాడు. ఈ ప్రపంచ కప్ లో నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కూడా యువరాజే అందుకున్నాడు. 

ఇలా భారత జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలోనే అతడు క్యాన్సర్ బారిన పడ్డాడు. అయితే ఎంతో పట్టుదలతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఈ కఠిన క్షణాల నుండి బయటపడి మళ్లీ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. కానీ మునుపటి మాదిరిగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో సెలెక్టర్లు జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అతన్ని జట్టు నుండి పక్కనబెట్టారు. అలా తనకెంతో ఇష్టమైన భారత  జట్టుకు రెండుళ్లుగా దూరంగా వుంటూ వస్తున్నాడు. ఇక మళ్లీ జట్టులో సంపాదించడం  కష్టమని భావించిన అతడు చివరకు ఇవాళ రిటైర్మెంట్ ప్రకటించాడు.