న్యూఢిల్లీ: టీమిండియాపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రం విసిరాడు. టీమిండియా స్పిన్నర్ హర్భజన్ చేసిన ట్వీట్ కు బదులిస్తూ ఆయన ఆ వ్యంగ్యాస్త్రం విసిరారు. నాలుగో స్థానంలో బ్యాట్స్ మన్ ను ఎంపిక చేసుకోలేక టీమ్ మేనేజ్ మెంట్ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.

ఆ ఇబ్బందిని పరిగణనలోకి తీసుకుని హర్భజన్ సింగ్ మేనేజ్ మెంట్ కు ఓ సలహా ఇచ్చాడు. నాలుగో స్థానంలో సంజూ శాంసన్ ను ఎందుకు ప్రయత్నించకూడదని హర్భజన్ అడిగాడు. శాంసన్ లో మంచి టెక్నిక్ ఉందని, ఆ స్థానంలో అతన్ని పరీక్షిస్తే మంచి ఫలితం రావచ్చునని ఆయన అన్నాడు. 

హర్భజన్ సలహాకు టీమ్ మేనేజ్ మెంట్ సమాధానం ఇవ్వలేదు గానీ ఆయన మిత్రుడు యువరాజ్ సింగ్ మాత్రం ఓ మాదిరి వెటకారంతో స్పందించాడు. "మన టాప్ ఆర్డర్ సూపర్ కదా బ్రో... మనకు నాలుగో స్థానంలో బ్యాట్స్ మన్ అవసరం లేదు" అని వ్యంగ్యంగా అన్నాడు.

నాలుగో స్థానంలో గతంలో యువరాజ్ సింగ్ ఆడేవాడు. బౌలింగు కూడా చేసేవాడు. నాలుగో స్థానంలో అతనిలా రాణించిన మరో ఆటగాడు లేకపోవడం గమనార్హం.