టీ20 వరల్డ్‌కప్‌ 2007 టోర్నీలో ఇంగ్లాండ్‌పై యువీ సృష్టించిన సిక్సర్ల సునామీ.., ఆ చారిత్రక ఇన్నింగ్స్‌కి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఫన్నీ వీడియో విడుదల చేసిన యువరాజ్ సింగ్...

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కి కాసింత అదృష్టం కూడా తోడై ఉంటే, లెజెండరీ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకునేవాడే. కెరీర్‌ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో క్యాన్సర్ బారిన పడడం, ఆ ప్రాణాంతక వ్యాధిని జయించి... కమ్‌బ్యాక్ ఇచ్చినా సరైన అవకాశాలు రాక జట్టుకి దూరమయ్యాడు యువీ...

క్రెడిట్ అంతా ఎమ్మెస్ ధోనీ ఖాతాలో చేసిన టీ20 వరల్డ్‌కప్ 2007, 2011 వన్డే వరల్డ్‌కప విజయాల్లో కీ రోల్ పోషించిన ప్లేయర్ యువరాజ్ సింగ్. టీ20 వరల్డ్‌కప్‌ 2007 టోర్నీలో ఇంగ్లాండ్‌పై యువీ సృష్టించిన సిక్సర్ల సునామీ, క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ మరిచిపోలేరు...

అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ నోటి దురుసుతో యువరాజ్ సింగ్‌ను ఏదో అనడం, ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి... ఆ కోపాన్ని స్టువర్ట్ బ్రాడ్‌‌పై చూపించడం జరిగిపోయాయి... స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాదిన యువరాజ్ సింగ్, 12 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు.

7 సిక్సర్లు, 3 ఫోర్లతో 16 బంతుల్లో 58 పరుగులు చేసిన యువరాజ్... ఆ రోజు ఏం జరిగిందో కళ్లకు కట్టినట్టు వివరిస్తూ... ఓ యూట్యూబ్ వీడియోను పోస్టు చేశాడు... సెప్టెంబర్ 19తో ఆ మ్యాచ్‌కి 14 ఏళ్లు పూర్తి అయ్యాయి.

Scroll to load tweet…

ఈ సందర్భంగా ఆ మ్యాచ్ సీన్‌ని రీక్రియేట్ చేస్తూ, కాస్త హ్యూమర్‌ని జోడించి అభిమానులను ఆకట్టుకుంటున్నాడు యువరాజ్ సింగ్. ‘నా యాక్టింగ్ ఎలా ఉంది... బాలీవుడ్‌కి వెళ్లిపోవచ్చా?’ అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు యువరాజ్ సింగ్...