అర్ష్‌దీప్ సింగ్ విషయంలో అలా! అశ్విన్ విషయంలో ఇలా... క్యాచ్ డ్రాప్ విషయంలో యువీ డబుల్ స్టాండ్స్...
India vs Pakistan: ఆసియా కప్ సమయంలో అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ విషయంలో అతనికి అండగా నిలవాలంటూ యువరాజ్ సింగ్ ట్వీట్... ఆర్ అశ్విన్ క్యాచ్ డ్రాప్ చేసి, పాకిస్తాన్‌కి ఫేవర్ చేశారంటూ యువీ తాజా ట్వీట్...
క్యాచెస్ విన్స్ మ్యాచెస్... మ్యాచులు గెలవాలంటే క్యాచులు అందుకోవడం చాలా ముఖ్యం. అయితే క్యాచులు మాత్రమే మ్యాచులను గెలిపించలేవు. ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన గత రెండు మ్యాచులు, ఈ రెండు సూత్రాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి...
2022 ఆసియా కప్ సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్‌తో తలబడింది టీమిండియా. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్లతో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు...
అయితే ఈ భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది టీమిండియా. బాబర్ ఆజమ్ 14, ఫకార్ జమాన్ 15 పరుగులు చేసి అవుటైనా మహ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు, మహ్మద్ నవాజ్ 42 పరుగులు చేశారు. 8 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 16 పరుగులు చేసిన అసిఫ్ ఆలీ ఇచ్చిన క్యాచ్‌ని అర్ష్‌దీప్ సింగ్ జారవిడిచాడు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌ని జారవిడచడంతో అర్ష్‌దీప్ సింగ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోషల్ మీడియా జనాలు...
అర్ష్‌దీప్ సింగ్ దేశద్రోహి అని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ సమయంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్‌కి అండగా నిలిచాడు.
‘ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే చూసే ప్రేక్షకులు కూడా టెన్షన్ తట్టుకోలేక కూర్చీలో సరిగా కూర్చోలేరు. అలాంటి క్రీజులో ఉన్న ప్లేయర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఒక్క డ్రాప్ క్యాచ్, అతని సత్తాని దిగజార్చదు. కుర్రాళ్లను విమర్శించడం ఆపేసి, సపోర్ట్ చేయండి...’ అంటూ ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్...
తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 సమయంలో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఓ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్‌లో షాన్ మసూద్ కొట్టిన షాట్‌ని అశ్విన్ క్యాచ్ అందుకున్నా, టీవీ రిప్లైలో బంతి నేలను తాకిన తర్వాత చేతుల్లోకి వచ్చినట్టు కనిపించింది. దీంతో షాన్ మసూద్ బతికిపోయాడు. నిజానికి అశ్విన్‌ది డ్రాప్ క్యాచ్ కాదు, క్యాచ్‌ని అంచనా వేయడంలో పొరపాటు జరిగింది...
అలా లైఫ్ దొరకడంతో బతికిపోయిన షాన్ మసూద్, ఇఫ్తికర్ అహ్మద్‌తో కలిసి మూడో వికెట్‌కి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీనిపై యువరాజ్ సింగ్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. ‘ఆర్ అశ్విన్ చేసిన డ్రాప్ క్యాచ్, పాకిస్తాన్‌కి ఫేవర్‌గా మూమెంట్‌ని మార్చేసినట్టుంది. క్యాచెస్ విన్ మ్యాచెస్... ఇండియా మళ్లీ కమ్‌బ్యాక్ ఇస్తుందనుకుంటా... కమ్ ఆన్ లాడ్స్’ అంటూ ట్వీట్ చేశాడు...
అర్ష్‌దీప్ సింగ్ విషయంలో అలా స్పందించిన యువరాజ్ సింగ్, ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్‌ని వెలెత్తి చూపించడాన్ని తప్పు బడుతున్నారు నెటిజన్లు. యువీ సపోర్ట్ కేవలం సిక్కు క్రికెటర్లకే ఉంటుందా? అంటూ కొత్త వివాదాన్ని లేవనెత్తుతున్నారు.
అయితే ఆఖర్లో బ్యాటింగ్‌లో మాస్టర్ మైండ్ చూపించి, టీమిండియాకి విజయాన్ని అందించిన అశ్విన్‌ని ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్. ‘ఎంతో కూల్‌గా బంతిని వైడ్ బాల్‌గా వదిలేశావు... అశ్విన్.. వాట్ ఏ గేమ్... నమ్మశక్యం కాకుండా ఉంది. ఇది మ్యాచ్ మాత్రమే కాదు, ఎమోషన్...’ అంటూ ట్వీట్ చేశాడు యువీ...