కులతత్వ వ్యాఖ్యల పట్ల భారత మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ క్షమాపణలు కోరాడు. ఉద్దేశపూర్వకంగా ఎవరి మనసులు నొప్పించలేదని, నా వ్యాఖ్యల పట్ల ఎవరైనా నొచ్చుకుంటే మన్నించాలని సోషల్‌ మీడియా వేదికగా కోరారు. 

ఈ మేరకు ట్వీటర్‌లో వివరణ ఇస్తూ ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో క్రికెటర్లు సోషల్‌ మీడియాలో తరచుగా మాట్లాడుకుంటున్నారు. డ్రెస్సింగ్‌రూమ్‌ కల్చర్‌, జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు, ఎదుర్కొన్న సవాళ్లు, కెరీర్‌లో మరిచిపోలేని మ్యాచులు.. ఇలా భిన్న అంశాలపై క్రికెటర్లు సోషల్‌ మీడియాలో స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు. 

భారత వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో యువరాజ్‌ సింగ్‌ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడారు. అదే సమయంలో భారత స్పిన్‌ ద్వయం యుజ్వెంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు సైతం ఆన్‌లైన్‌లోకి వచ్చారు. 

చాహల్‌, కుల్దీప్‌లను ఉద్దేశించి యువరాజ్‌ సింగ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. భంగీ (సఫాయి) కులస్థుల పేరిట అనుచిత వ్యాఖ్యలు చేశారు. యువీ కామెంట్‌తో రోహిత్‌ శర్మ నవ్వాడు. దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన యువరాజ్‌ సింగ్‌పై ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్‌ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. దీంతో క్షమాపణలు చెబుతూ యువరాజ్‌ సింగ్‌ వివరణ ఇచ్చుకున్నాడు.