యువరాజ్ సింగ్...  అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు. ముఖ్యంగా తన ధనాధన్ బ్యాటింగ్ టీమిండియాకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడు. అతడు లేకుంటే టీమిండియాకు 2007 టీ20 వరల్డ్ కప్,  2011  ప్రపంచ కప్ లేదనే చెప్పాలి. ఇలా యువీ కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో టీమిండియా కోచ్ గా గ్రేగ్ చాపెల్ వచ్చాడని...అతడే తన కొడుకు కెరీర్ ను నాశనం చేశాడని యువరాజ్ తండ్రి యోగరాజ్ సింగ్ ఆరోపించాడు. లేదంటే యువీ ఇంకొన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగేవాడని ఆయన అభిప్రాయపడ్డారు. 

టీమిండియా కోచ్ గా చాపెల్ ఆటగాళ్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాక్టీస్ చేయించేవాడు కాదని ఆరోపించారు. లోకల్ క్రీడలను వారి ప్రాక్టిస్ లో జొప్పించేవాడని....ఇలా చేయడం వల్లే యువీ కెరీర్ నాశనమయ్యిందన్నాడు. టీమిండియా ఆటగాళ్లను చాపెల్  ఖోఖో ఆడించేవాడని... ఇలా ఆడుతున్న సమయంలోనే యువీ మోకాలి గాయానికి   గురయ్యాడని వివరించారు. ఈ గాయం  కారణంగానే యువీ అనేకసార్లు టీమిండియా కు దూరమవ్వాల్సి వచ్చిందన్నాడు.  అందువల్లే తన కొడుకు కెరీర్ నాశనమవడానికి కారణమైన చాపెల్ ను ఎప్పటికీ క్షమించనని యోగరాజ్ తెలిపారు.

ఇలా యువీ  గాయపడకుంటే అంతర్జాతీయ టీ20, వన్డే రికార్డులు చాలావరకు అతడి పేరిటే వుండేవి. అంతేకాకుండా ఇంత తొందరగా అతడు క్రికెట్ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇంకా అతడు భాతర జట్టుకు తన సేవలు అందించేవాడని యోగరాజ్  అభిప్రాయపడ్డారు.