భారత క్రికెట్లో ఒక నవశకానికి నాంది పలికిన క్రికెటర్ యువరాజ్ సింగ్ అని చెప్పవచ్చు. భారత శిబిరంలో ఎడమచేతిలోవాటంతో ఇటు పరుగులు సాధిస్తూ, అటు వికెట్లను కూలుస్తూ మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు.

అల్ రౌండర్ అంటే ఏదో వస్తాడు విధ్వంసం సృష్టిస్తాడు వెళ్ళిపోతాడు అన్నట్టుగా కాకుండా, ఆ స్థానంలో నిలబడి ఒంటిచేత్తో ఎన్నో మ్యాచుల్లో భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడి నిష్క్రమణ తరువాత భారత జట్టుకు ఇప్పటివరకు సరైన నెంబర్ 4 బ్యాట్స్ మెన్ యే దొరకలేదు అంటే అతిశయోక్తి కాదు. 

ఇలా ఎన్నో స్ఫూర్తిదాయక ప్రదర్శనలు చేసిన యువరాజ్ సింగ్ ఐపీఎల్ లో కూడా దుమ్ము రేగ్గొట్టాడు. కానీ ఐపీఎల్ చివరి దశకు వచ్చేసరికి మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోయాడు. ఈసందర్భంగా ఆటలో డబ్బువల్ల పెరిగే ఒత్తిడిపై యువ ఆటగాళ్లకు యువి ఒక సలహా కూడా ఇస్తున్నాడు. 

ఐపీఎల్ తొలి సీజన్‌లో యువరాజ్‌ సింగ్‌ మొహాలి (కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)కు ఐకాన్‌ ఆటగాడు. 2016లో యువరాజ్‌ సింగ్‌ కోసం ఢిల్లీ డెర్‌డెవిల్స్‌ కండ్లుచెదిరే రీతిలో రూ. 16 కోట్లు వెచ్చించింది. ఆ సీజన్‌లో యువరాజ్‌ సింగ్‌ అంతగా మెప్పించలేదు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ సైతం యువరాజ్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. 

ఢిల్లీ, బెంగళూర్‌ తరఫున యువీ అంచనాలను అందుకోవటంలో విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో భారీ ధర ఆటగాళ్లలో మార్పు తీసుకొస్తుంది. వేలంలో రికార్డు ధరతో పాటే ఒత్తిడి సైతం వస్తుందని యువీ అన్నాడు. 

వేలంలో భారీ ధరతో ఒత్తిడి వచ్చేస్తుందని యువి అభిప్రాయపడ్డాడు. భారీ ధర దక్కించుకున్న తర్వాత సరిగా ఆడకపోతే ఒత్తిడి ఉంటుందని, కోట్లలో సంపాదిస్తూ, పరుగులు చేయటం లేదని విమర్శిస్తారని యువరాజ్ తన మనసులోమాటను బయటపెట్టాడు. 

ఆటగాళ్లకు వ్యతిరేకంగా ప్రచురితమైన వార్తలు చాలా వేగంగా ప్రజల్లోకి వెళతాయని, అంతిమంగా ఆటగాళ్లపై ప్రభావం పడుతుందని యువరాజ్ సింగ్ తన కెరీర్ లో ఎదురైనా అనుభవాలను చెప్పుకొచ్చాడు. 

ఈ సందర్భంగా యువరాజ్ సింగ్ యువ క్రికెటర్లకు సలహా కూడా ఇచ్చాడు. టెలివిజన్‌, పత్రికలకు దూరంగా ఉండాలని, వార్తలను పెద్దగా పట్టించుకోవద్దని యువీ  వర్ధమాన యువ ఆటగాళ్లకు హితవు పలికాడు. 

ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న రికార్డు ఇప్పటికి యువరాజ్‌ సింగ్‌దే. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున యువరాజ్‌ సింగ్‌ 2016లో ఐపీఎల్‌ ట్రోఫీని అందుకున్నాడు.