India Vs South Africa: కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆదివారం ముగిసిన మూడో వన్డేలో భారత జట్టు ఓడినా దీపక్ చాహర్ పోరాటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కాబోయే భార్య  జయా భరద్వాజ్ కూడా... 

ఆదివారం కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడో వన్డేలో భారత్ ను విజయపుటంచుల వరకు తీసుకెళ్లిన దీపక్ చాహర్.. ఆట తుది అంకంలో నిష్క్రమించడంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. టీమిండియా మ్యాచ్ ఓడిన అనంతరం అతడు.. కన్నీటి పర్యంతమయ్యాడు. 288 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా 220 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను అతడు ఆదుకున్నాడు. భారత జట్టు ఓడినా చాహర్ పోరాటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కాబోయే భార్య జయా భరద్వాజ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. 

ఇన్స్టాగ్రామ్ లో చాహర్ ఫోటోలను షేర్ చేస్తూ ఆమె కింది విధంగా రాసుకొచ్చింది.. ‘ప్రతిరోజూ పొద్దున్నే లేచి ప్రాక్టీసుకు వెళ్తావు. దేశం కోసం ప్రతి మ్యాచులోనూ నీ ఉత్తమ ప్రదర్శన అందించడానికి తాపత్రాయపడతావు. నీలో అదే తపన నిన్నటి మ్యాచులో కూడా నేను చూశాను. క్లిష్ట పరిస్థితులలో కూడా కఠిన శ్రమకు ఓర్చి అంకితభావంతో ఆట పట్ల నిబద్ధతతో నువ్వు ముందుకు సాగే విధానమే నిన్ను ఛాంపియన్ గా నిలుపుతున్నది. 

View post on Instagram

ఆటలో గెలుపోటములు సహజం. కొన్ని సార్లు నువ్వు గెలువొచ్చు . కొన్ని సార్లు ఓడొచ్చు. కానీ నువ్వు పడే తపన, చేసే కృషి దేశాన్ని గర్వపడేలా చేస్తాయి. నీ దేశం కోసం, జట్టు కోసం ఎంత కఠిన సవాల్ కైనా సిద్ధమని చెప్పావ్.. పట్టుదలగా నిలబడ్డావ్.. నిన్ను చూసి గర్విస్తున్నాను.. జై హింద్..’ అంటూ పేర్కొంది. 

Scroll to load tweet…

దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి పోరులో 34 బంతుల్లో 54 పరుగులు చేసిన చాహర్.. భారత్ విజయానికి 10 పరుగుల దూరంలో నిష్క్రమించాడు. ఎంగిడీ వేసిన స్లో బంతికి భారీ షాట్ ఆడి ప్రిటోరియస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడు ఔట్ అయ్యాక బుమ్రా, చాహల్ కూడా నిష్క్రమించడంతో భారత్ నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్ ఓడాక చాహర్ కన్నీటి పర్యంతమైన వీడియో కూడా నెట్టింట వైరల్ గా మారింది.