శుభ్ మన్ గిల్...టీమిండియా భవిష్యత్ ఆశాకిరణం. అండర్ 19, భారత్-ఏ క్రికెటర్ గా అద్భుత ప్రదర్శన చేసి భారత జట్టులో చోటు దక్కించుకున్నా అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయాడు. అయితే ఇటీవల వెస్టిండీస్‌-ఏ జట్టుతో తో జరిగిన అనధికారిక వన్డే సీరిస్ భారత్‌-ఏ జట్టు తరపున చెలరేగిపోయాడు. మొత్తంగా 3 హాఫ్ సెంచరీలో 218 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సీరిస్ గా నిలిచాడు. దీంతో మరోసారి ఇతడి పేరు మారుమోగుతోంది. 

అతిచిన్న వయసుల్లో అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదిగిన ఇతడు మరికొద్దిరోజుల్లో 20పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతన్ని ఓ స్పోర్ట్స్ సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో అతడు తన కెరీర్, క్రికెటర్ అనుభవాలు, ఆదర్శంగా నిలిచిన వ్యక్తుల గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. 

''నేను ప్రస్తుతం ఈ స్థాయిలో వున్నానంటే అందుకు కారణం మా కోచ్ రాహుల్ ద్రవిడ్. ఆయన పర్యవేక్షణలోనే నేను అండర్ 19, ఇండియా-ఏ క్రికెట్ ఆడాను. తాను ఏ స్ధాయిలో వున్నా ద్రవిడ్ సార్ చెప్పిన మాటలను మరిచిపోను. టెక్నికల్ గానే కాకుండా మానసికంగానూ యువకులను తీర్చిదిద్దడంలో ఆయన చూపించే చొరవ చాలా గొప్పది.

ఆయన సలహాలు ,నాకెంతో ఉపయోగపడ్డాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మన సహజసిద్దమైన బ్యాటింగ్ స్టైల్ ను వీడొద్దని ఎప్పుడూ చెబుతుంటారు. దాన్నే తాను ఇప్పటికీ  పాటిస్తున్నాను...ఇకపై కూడా పాటిస్తాను. '' అని గిల్ తన  గురువు ద్రవిడ్ ను ప్రశంసించాడు. 

ఇక తనను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వంటి  లెజెండ్ తో పోలుస్తుంటే కాస్త ఇబ్బందిగా వుంటుందన్నాడు. ఆఫ్ సిన్ బౌలింగ్ మణికట్టును ఉపయోగించి తాను ఆడే షాట్ కోహ్లీ ఆడే షాట్ మాదిరిగా వుంటుంది. ఇంతమాత్రానికే తనను అతడి వారసుడని అంటున్నారు. కోహ్లీ వంటి దిగ్గజాలను తమ జనరేషన్ ఆదర్శంగా తీసుకుంటుందని...అందువల్ల అతడికి సరితూగే  ఆటగాన్నని తాను అనుకోవడం  లేదని గిల్ తెలిపాడు.