మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువ క్రికెటర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే...ముంబైకి చెందిన కరణ్ తివారీ (27) అనే క్రికెటర్ ముంబై ప్రొఫెషనల్ జట్టుకు నెట్ ప్రాక్టీస్ బౌలర్‌గా వ్యవహరిస్తున్నాడు.

అయితే కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా క్రికెట్‌కు సంబంధించిన పలు టోర్నీలు, మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో కరణ్ తన కెరీర్‌ పట్ల తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

ఈ క్రమంలో ఒత్తిడికి గురైన కరణ్ సోమవారం ముంబైలోని మలాద్‌లో ఉన్న తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

మలాద్ ప్రాంతానికి చెందిన కరణ్.. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ప్రస్తుతం ఉన్న క్రికెట్ కెరీర్‌లో సరైన అవకాశాలు రావడంలేదని తన స్నేహితులతో చెప్పేవాడని పోలీసులు పేర్కొన్నారు.

ముంబై సీనియర్ జట్టులో చోటు కోసం కరణ్ పలుమార్లు ప్రయత్నించి విఫలమైనట్లుగా తెలుస్తోంది. అతని అకాల మరణంపై జితు వర్మ విచారం వ్యక్తం చేశారు. కరణ్ చాలా ఏళ్లుగా క్రికెట్‌లో ఎదగడానికి కష్టపడుతున్నాడని పేర్కొన్నారు.