Asianet News TeluguAsianet News Telugu

బ్రాడ్మన్ తర్వాత అతడే.. అయినా టీమిండియాలో చోటు దక్కదా..? సర్ఫరాజ్‌ను విస్మరించడంతో బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం

Sarfaraz Khan: న్యూజిలాండ్ తో పాటు  ఆస్ట్రేలియాతో రెండు టెస్టులకు ఆడబోయే  భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. అయితే ఈసారి టెస్టు జట్టులో తప్పకుండా చోటు దక్కుతుందనుకున్న   సర్ఫరాజ్ కు మరోసారి నిరాశే మిగిలింది. 

You can not do more than he has: Twitter Users Slams  BCCI For Not Include Sarfaraz Khan  in Test Squad Against Australia
Author
First Published Jan 14, 2023, 12:42 PM IST

దేశవాళీలో టన్నుల కొద్దీ పరుగులు.. రెండేండ్లుగా నిలకడకు మారుపేరు.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ సగటు తర్వాత అతడిదే..  ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో కూడా ఐదు మ్యాచ్ లలో 431 పరుగులు.. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక గత రెండేండ్లైతే  అతడి బ్యాట్ నుంచి పరుగులు అస్సాం వరదల కంటే ధారాళంగా ఏరులై పారాయి.  ఇంత చేసినా ఏం లాభం..?  జాతీయ జట్టులోకి చోటు దక్కించుకోవడానికి ఈ ప్రదర్శన   సరిపోదట సెలక్టర్లకు.. ముంబై సంచలనం సర్ఫరాజ్ ఖాన్ ను సెలక్టర్లు మళ్లీ  పక్కనబెట్టారు.  

త్వరలో న్యూజిలాండ్ తో టీ20, వన్డేలతో పాటు ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు గాను  చేతన్ శర్మ సారథ్యంలోని ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ  శుక్రవారం రాత్రి  జట్లను ప్రకటించింది.   ఆసీస్ తో టెస్టులకు కచ్చితంగా చోటు దక్కించుకుంటాడనుకున్న సర్ఫరాజ్ కు మరోసారి వామహస్తమే మిగిలింది. 

ఈ ముంబై కుర్రాడికి మరోసారి నిరాశే మిగలడంతో   సర్ఫరాజ్ స్పందన ఎలా ఉందో గానీ  టీమిండియా ఫ్యాన్స్, క్రికెట్ పండితులు మాత్రం బీసీసీఐపై దుమ్మెత్తి పోస్తున్నారు.‘టీమిండియాలోకి  రావాలంటే ఇంకేం చేయాలి..? ఈ ప్రదర్శనలు చాలవా..?’అని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే ఇదే విషయమై   స్పందిస్తూ.. ‘ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్న సర్ఫరాజ్ ఖాన్  ను టెస్టు జట్టులోకి తీసుకోకపోవడం బాధాకరం. అతడు ఇంకేం చేయాలి..?’ అని ట్వీట్ చేశాడు. టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. ‘టెస్టు జట్టులో పలు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.  సర్ఫరాజ్ ఖాన్  ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని అనుకున్నా. జాతీయ జట్టులోకి రావడానికి అతడు చేయాల్సిందంతా చేశాడు...’ అని   ట్వీట్ చేశాడు. 

 

ఇక ఫ్యాన్స్ అయితే బీసీసీఐని ఓ ఆటాడుకున్నారు.  సూర్యకుమార్ యాదవ్ ను టెస్టు జట్టులోకి పిలవడం శుభపరిణామమే అయినా సర్ఫరాజ్ ను పక్కనబెట్టడం భావ్యం కాదని వాపోతున్నారు.  కెఎల్ రాహుల్ బదులు  సర్ఫరాజ్ ను ఎంపిక చేస్తే బాగుండేదని సూచిస్తున్నారు.  ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇషాన్ కిషన్ కంటే గొప్ప రికార్డులు ఉన్న  సర్ఫరాజ్ ను కాదని కిషన్  ను తీసుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios